గత రెండు మూడు రోజులుగా వైసీపీ ముఖ్య నేత, నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి, కరోనా విషయం పక్కన పడేసి, తీవ్ర రాజకీయ విమర్శలు చేస్తూ, వార్తల్లో ఉంటున్నారు. ఆ విమర్శలు కూడా, మరీ శ్రుతిమించి, దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం, చంద్రబాబుని, లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ పెట్టిన ప్రెస్ మీట్ లోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసారు. రాష్ట్రంలో టెస్టింగు కిట్ల విషయంలో, ఒక్కో కిట్ 400 రూపాయలకు ఎందుకు ఎక్కువకి కొన్నారు ? లక్ష కిట్లు కొంటే, 4 కోట్లు నష్టం కదా అని అడిగినందుకు, కన్నా పై విరుచుకు పడ్డారు విజయసాయి రెడ్డి. మమ్మల్నే కిట్ల గురించి అడుగుతారా అనో ఏమో కాని, కన్నా పై విరుచుకు పడ్డారు విజయసాయి రెడ్డి. కన్నా లక్ష్మీనారాయణ, చంద్రబాబుకి 20 కోట్లకి అమ్ముడుపోయారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పై ఆరోపణలు చేసారు. ఇందుకు మరో బీజేపీ నేత, సుజనా మధ్యవర్తిత్వం నడిపారని అన్నారు.
అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై, బీజేపీ విరుచుకు పడింది. విజయసాయి రెడ్డిని జైలు పక్షి, ఢిల్లీలో బ్రోకర్, నీ గుట్టు అంతా అమిత్ షా, మోడీ దగ్గర ఉంది అంటూ, విరుచుకు పడ్డారు. తరువాత, స్వయంగా కన్నా లక్ష్మీ నారాయణ కూడా ప్రెస్ మీట్ పెట్టి, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. నేను మీరు చేసిన విషయం ప్రస్తావించాను. రేట్లు ఎందుకు తేడా వచ్చాయో చెప్పమన్నాను, దానికి ఎందుకు బుజాలు తడుముకుంటారు ? దానికి ఇష్టం వచ్చినట్టు ఎందుకు వ్యాఖ్యలు చేసారు. మీ పై పరువు నష్టం దావా వేస్తాను. మీరు చేసిన ఆరోపణలు నిజం అని, కాణిపాకంలో ప్రమాణం చేస్తావా? అధికారం తలకి ఎక్కి మాట్లాడుతున్నారు అంటూ, విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు కన్నా.
కన్నా చేసిన వ్యాఖ్యల పై ఈ రోజు మరోసారి, విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, మరోసారి బీజేపీ నాయకుల పై విమర్శలు చేసారు. ముఖ్యంగా కన్నాని టార్గెట్ చేసుకుంటూ మరోసారి మాట్లాడారు. నన్ను అవినీతి పరుడు అంటున్నారు అని, నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. కాణిపాకం లేదంటే తిరుమలలో కూడా ప్రమాణం చెయ్యటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కన్నా 20 కోట్లుకి అమ్ముడు పోయారని, మరోసారి విజయసాయి రెడ్డి అన్నారు. సుజనానే సూట్ కేసు కంపెనీలు పెట్టి, డబ్బులు ఎగ్గోట్టారని అన్నారు. సుజనా దగ్గర గతంలో తాను పనిచేశానని అన్నారు. అయితే ఇదే సందర్భంలో, అనూహ్యంగా పురందేశ్వరి పేరు తెర మీదకు తెచ్చారు విజయసాయి రెడ్డి. గత ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఎంత ఇచ్చింది, కన్నా, పురందేశ్వరి ఎంతెంత తీసుకున్నది తనకు తెలుసు అని అన్నారు. మరి ఈ విషయం పై, పురందేశ్వరి, కన్నా ఏమంటారో.