యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించినట్లయితే ఫలితాల వెల్లడికి ఆరు రోజుల సమయం పడుతుందన్న ఎన్నికల సంఘం(ఈసీ) సమాధానంపై పిటిషన్‌దారులైన 21 ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఈసీ తమ డిమాండ్‌ను అంగీకరించినట్లయితే ఫలితాల వెలువరించడానికి ఐదు రోజులు ఆలస్యమైనా తమకు సమ్మతమేనని తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో శనివారం అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల విధానంపై విశ్వాసం కలుగుతుందనుకుంటే ఫలితాల వెల్లడికి 5.2రోజులు ఆలస్యమైనా ఫరవాలేదని పేర్కొన్నారు. లెక్కించే సిబ్బందిని పెంచితే ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల సంఘంపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదన్నారు. ఎన్నికలు సజావుగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా జరగడమే తమకు కావాలన్నారు.
మొత్తం 13.5లక్షల ఈవీఎంలలో కేవలం 479 ఈవీఎంలను మాత్రమే వీవీ ప్యాట్‌లతో సరిపోల్చడం వల్ల ప్రజల్లో విశ్వాసం కలగదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అలాగే ఎన్నికల సంఘం చెప్పినట్లు సిబ్బందిని పెంచని పక్షంలోనే లెక్కింపునకు 5.2 రోజుల సమయం పడుతుందన్నారు. ఒకవేళ సిబ్బందిని రెట్టింపు చేస్తే 50 శాతం వీవీప్యాట్లను లెక్కించడానికి 2.6 రోజులు.. 33శాతం లెక్కిస్తే 1.8 రోజులు.. 25 శాతం స్లిప్పులను లెక్కిస్తే కేవలం 1.3రోజుల సమయం మాత్రమే పడుతుందని అఫిడవిట్‌లో వివరించారు.
ఈవీఎంలపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తప్పినిసరిగా 50శాతం మేర వీవీప్యాట్లను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ ప్రతిపక్షాలు కోరినట్లు లెక్కింపు చేపడితే ఫలితాల వెల్లడికి ఆరు రోజులు సమయం పడుతుందని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈసీ వివరణపై స్పందించాలని సుప్రీంకోర్టు పిటిషన్‌దారులను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.