ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలకు వింత పరిస్థితి ఏర్పడింది. కుడితోలో పడ్డ ఎలుకులా మారింది. తెలుగుదేశం పార్టీతో పొట్టు పుణ్యమా అని, గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకుని, రాష్ట్రంలో అధికార వైభవాన్ని వెలగబెట్టిన ఆ పార్టీ నేతలుకు తాజా పరిస్థతి ఘోరంగా మారింది. బీజేపీ అనే పేరు పలకటానకే, రాష్ట్ర ప్రజలు ఇష్ట పడటం లేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం , రాష్ట్రంలో పుంజుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి అది ఇచ్చాం , ఇది ఇచ్చాం, లక్షల కోట్లు ఇచ్చాం, పోలవరం మా పుణ్యమే, ఇళ్ళు మా పుణ్యమే, అసలు ఆంధ్రప్రదేశ్ లో మనషులు బ్రతుకుతున్నారు అంటే మా పుణ్యమే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రజలు మాత్రం, వీరిని నమ్మటం లేదు. అందుకే ఇప్పుడు పాజిటివ్ గా వెళ్తే, ప్రజలు విశ్వసించటం లేదని, వ్యూహం మార్చి, నెగటివ్ గా వెళ్తున్నారు.
బెంగాల్, కేరళ తరహా వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. బెంగాల్, కేరళలో బీజేపీ ఒకప్పడు ఒక్కశాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. కానీ ఇప్పుడు కొంతమేర బలపడింది. దీని వెనుక అసలు కారణం ఎప్పటికప్పుడు తమ పార్టీ కార్యకర్తలు, అనుబంధసంస్ధల కార్యకర్తలపై దాడులు, ప్రతిదాడులు వ్యవహారాలతో ఎప్పుడు యాక్టివ్గా ఉండడం.. రాజకీయం, ప్రజా సంక్షేమం కన్నా ఇతర భావోద్వేగ అంశాలతోనే ఆయా రాష్ట్రాల్లో దూకుడుగా వ్యూహాలు అమలుచేస్తోంది. ఈ క్రమంలో దాడులు ప్రతిదాడులకు ఆ పార్టీ శ్రేణులు పాల్పడుతున్నారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ విభజనహామీల ఉద్యమకారులపై ప్రయోగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందులో భాగంగానే, ఎవరన్నా ప్రజలు , కడుపు మండి నిరసన తెలుపుతున్నా, వారిని తరిమి తరిమి కొడుతున్నారు. ఇలా రెచ్చగొట్టి, అవతల వైపు నుంచి కూడా వచ్చి కలబడితే, భావోద్వేగం రేపి, చలి కాచుకోవాలని బీజేపీ ఎత్తుగడ.. ఒంగోలులో ప్రత్యేక హోదా ప్లకార్డు పట్టుకున్నారని వెంటపడికొట్టారు. కావలిలో చెప్పు చూపించారని, చెప్పులతో చితక్కొట్టారు. అనంతపురంలో వెంటపడి మరీ జెండాలు తగులపెట్టారు. ఇవన్నీ చూస్తూ ఉంటే, బీజేపీ ఎదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టే తెలుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో పర్యటనలకు వస్తూ ఉంటే నిరసనల సెగ ఎదురవుతోంది. నిరసనలు తట్టుకోలేక పోతున్న బీజేపీ నేతలు దూకుడుగా ప్రవర్తిస్తున్నారు.