దశాబ్దాల కల నెరవేరినందుకు సంతోషించాలా? 125 ఏళ్ల అనుబంధాన్ని తుంచేసినందుకు బాధపడాలా? విశాఖ రైల్వేజోన్ ప్రకటిస్తూనే... వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేయడంపై వ్యక్తమవుతున్న ఆవేదన, ఆక్రోశమిది! జోన్‌ను ప్రకటించేసి, అప్పటిదాకా అక్కడున్న డివిజన్‌ను ఎత్తివేయడం భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి! డివిజన్ ఉన్నచోట కొత్తగా జోన్ వస్తే... రెండింటినీ కొనసాగించారు తప్ప డివిజన్‌ను రద్దు చేయలేదు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో 16 రైల్వే జోన్‌లు ఉన్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఉండగా... అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్‌లో రెండు డివిజన్‌లు కొనసాగుతున్నాయి. కోల్‌కతా కేంద్రంగా తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్‌లు నడుస్తున్నాయి. కోల్‌కతా కేంద్రంగానే హౌరా, సియల్దా డివిజన్లు కూడా ఉన్నాయి. బిలా్‌సపూర్ డివిజన్‌ను అప్‌గ్రేడ్ చేసి ఆగ్నేయ మధ్య రైల్వే జోన్‌ను ఇచ్చారు. డివిజన్‌ను యథాతథంగా కొనసాగించారు. చెన్నై, ముంబైలో కూడా జోన్, డివిజన్‌లు ఒకేచోట ఉన్నాయి.
అయితే... ఒక్క విశాఖ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించింది. కొత్తగా దక్షిణకోస్తా రైల్వేజోన్ ప్రకటించి... విశాఖ కేంద్రంగా 125 ఏళ్లుగా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేసింది. దీనిని రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ప్రకటించింది. మరో ముక్కను విజయవాడలో కలిపింది. డివిజన్, జోన్ ఒక చోటలేకపోవడంవల్ల పరిపాలన, నిర్వహణ, సమన్వయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సమస్యలు, డిమాండ్‌లు, అనుమతుల వంటివి ముందుగా డివిజనల్ అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాతే ప్రధానకేంద్రానికి రావాలి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర రైల్వే సమస్యల పరిష్కారానికి ‘వాల్తేరు’ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. విశాఖ రైల్వే స్టేషన్‌కు, వాల్తేరు డివిజన్‌కు 125 ఏళ్ల చరిత్ర ఉంది. 1893-96లో బెంగాల్-నాగపూర్ రైల్వేగా(బీఎన్‌ఆర్) ఉన్న సమయంలో విశాఖకు రైల్వే లైను వచ్చింది. అప్పట్లో విశాఖను వాల్తేరు స్టేషన్‌గా పిలిచేవారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర పల్లెవాసులు విశాఖను ‘వాల్తేరు’గానే పిలుచుకుంటారు. 1960లో డీబీకే (దండకారణ్య, బొలంగీర్, కిరుబురు) పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టారు. దీంతో భారతీయ రైల్వే చరిత్రలోనే వాల్తేరు డివిజన్ ఇంజనీరింగ్ విభాగానికి ప్రత్యేక స్థానం ఉంది.
కొత్తవలస-కిరండోల్ (దండకారణ్య లైను 446 కిలోమీటర్లు), సంబల్‌పూర్-టిట్లాఘర్ (బొలంగీర్ లైను -.182 కిలోమీటర్లు, బీమాల్‌గర్-కిరుబురు (కిరుబురు లైను... 34 కిలోమీటర్లు) మార్గాలను వాల్తేరు రైల్వే డివిజన్ ఇంజనీర్లే నిర్మించారు. కొత్తవలస-కిరండోల్, కొరాపుట్-రాయగడ లైన్‌ల ఏర్పాటులో వాల్తేర్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారుల ప్రతిభపై ఇప్పటికీ అనేకమంది అధ్యయనాలు చేస్తుంటారు. అదే సమయంలో తీర ప్రాంతం, ఓడ రేవుల అనుసంధానం, రైలు మార్గం ఉన్న నేపథ్యంలో విశాఖకు ప్రాధాన్యం పెరిగింది. కొత్తగా జోన్‌లు, డివిజన్లు, పరిధుల మార్పులు చోటు చేసుకున్నప్పటికీ... వాల్తేరు డివిజన్‌కు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఈ డివిజన్‌తో ఉత్తరాంధ్రవాసులకు భావోద్వేగమైన అనుబంధం ఉంది. డివిజన్ రద్దు చేసేముందు ఇక్కడ పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలు కూడా తెలుసుకోలేదు. లైన్ల విభజన, విలీనంపై రైల్వే మంత్రి స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన ఆదాయ వనరులుగా గుర్తింపు పొందిన కేకే లైను, కేఆర్ లైను, ఆర్‌వీ లైన్లను రాయగఢ డివిజన్‌లోనే కలుపుతున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ, కొత్తవలస, విజయనగరం ప్రధాన లైనులో ఉన్నా(మెయిన్ లైన్) విశాఖ రైల్వే స్టేషన్ మెయిన్ లైనులోకి రాకపోవడంతో మెలికలు పెట్టవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.