‘రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు జలవనరులే అతిపెద్ద ఆకర్షణ కానున్నాయి. అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయస్థాయి జలక్రీడలకు అనువైన వాతావరణాన్ని అమరావతిలో కల్పించాలి. పర్యాటకం, వినోదం, క్రీడలకు అమరావతి చిరునామాగా మలచాలి’-అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘ఎఫ్1 హెచ్2వో’ పేరిట వాటర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఇటలీకి చెందిన యుఐఎం సంస్థ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నవంబరు మాసంలో అంతర్జాతీయ జల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు యుఐఎం సిద్ధమవుతోంది..
ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం దృష్ట్యా చైనా, ఫ్రాన్స్, యుఏఈ తరువాత అమరావతిని ఒక సర్క్యూట్‌గా తీసుకుంటున్నట్టు యుఐఎం ప్రతినిధులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ఉత్సవాలపై వారు ముఖ్యమంత్రికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్2వో రేసింగ్ పేరుతో పవర్‌బోట్ రేసింగ్, ఎఫ్1హెచ్2వో పేరుతో వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆక్వాబైక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.
వచ్చే ఏడాది జరిగే ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి 300, 400 మంది క్రీడాకారులు వస్తారని, వారు కనీసం వారం రోజులు బస చేసేందుకు మొత్తం 1200 హోటల్ గదులు అవసరం అవుతాయని పర్యాటక కార్యదర్శి ఎం.కే. మీనా ముఖ్యమంత్రికి వివరించారు.
గోదావరి, కృష్ణానదులలో ఏడాది పొడవునా జలక్రీడలకు సంబంధించిన ఈ తరహా అన్నిరకాల పోటీలను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పర్యాటక శాఖను ఆదేశించారు. జలక్రీడలకు సంబంధించిన పరికరాలు, పడవలు, ఇతర సాధనాలకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేకంగా ఒక ప్రాథికార సంస్థని ఏర్పాటుచేస్తామని చెప్పారు.