ప్రపంచ ప్రఖ్యాత వేదిక పై, మరోసారి నవ్యాంధ్రకు గుర్తింపు లభించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాల గురించి ప్రపంచ ఆర్ధిక వేదిక తొలిసారి శ్వేతపత్రాన్ని రూపొందించింది. సుస్థిర ఉత్పాదకత సత్వర సాధన అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలితో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక సంయుక్త పత్రాన్ని విడుదల చేసింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి అద్భుతమంటూ ప్రపంచ ఆర్ధిక వేదిక కితాబిచ్చింది.. పెట్టుబడులకు అవకాశాలు అపారమంటూ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మొత్తం 28 పేజీలతో పారిశ్రామిక సానుకూల అంశాలను విడుదల చేసింది. ఆటోమోటివ్, ఎలక్ర్టానిక్ పరిశ్రమలకు సంబంధించి 2022 నాటికి ఏటా 5 US బిలియన్ డాలర్ల మేర అవకాశాలు వున్నాయని తొలిపేజీలో WEF ప్రముఖంగా పేర్కొంది.
ఇప్పటికే త్రీడీ ముద్రణ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలో ముందంజలో వుంచడమే కాకుండా నిపుణులైన మానవ వనరుల కేంద్రంగానూ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతోందని ప్రభుత్వం కృషిని వెల్లడించింది. రెండంకెల వృద్ధి నమోదు కావడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటిస్థానం దక్కడాన్ని ప్రస్తావించింది. 12 రంగాలపై ప్రముఖంగా దృష్టి పెట్టిందని.. వీటి అభివృద్ధికి ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను అనుసరిస్తున్నట్టు తెలిపింది. మొత్తం నాలుగు చాప్టర్లుగా వెలువరించిన ఈ పత్రంలోని తొలి ఛాప్టర్ భారతదేశంలో పారిశ్రామిక ముఖచిత్రం, రెండో చాప్టర్ సుస్థిర ఉత్పాదకతను పెంపొందించడానికి దోహదపడే నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికత… మూడవ చాప్టర్ సుస్థిర ఉత్పాదకత విలువ, నాలుగో చాప్టర్‌లో సుస్థిర ఉత్పాదకతకు మార్గం శీర్షికలతో వివరణాత్మక అంశాలు నిక్షిప్తం చేశారు.
రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఆటో హబ్‌గా రూపొందుతున్నాయని, అనంతపురం జిల్లాలో కియా మోటార్స్, వీరవాహన బస్ బిల్డింగ్, చిత్తూరులో ఇసుజు, హీరో మోటో కార్ప్, అమరరాజా గ్రూప్, అపోలో టైర్స్, ఆటో కాంపొనెంట్ తయారీ యూనిట్లు ఉండగా.. నెల్లూరులో భారత్ ఫోర్జ్, కృష్ణా జిల్లాలో అశోక్ లేల్యాండ్ వంటి ఆటో మొబైల్ రంగ దిగ్గజాలు వేళ్లూనుకున్న వైనాన్ని సంయుక్త పత్రంలో తెలియజేశారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, హైపర్ లూప్ వంటి సరికొత్త ప్రజా రవాణా విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు చేస్తున్న యోచనను శ్వేతపత్రంలో గుర్తుచేశారు. శ్రీసిటీ, తిరుపతి, కాకినాడ, విశాఖ, అనంతపురం, అమరావతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్టు సంయుక్తపత్రంలో పేర్కొన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… గుర్తించిన సాంకేతిక అంశాలతో అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని సంయుక్త పత్రం పేర్కొంది. http://www3.weforum.org/docs/WEF_White_Paper_Accelerating_Sustainable_Production_report_2018.pdf