తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణ ఓటర్లు ఇచ్చే తీర్పు ప్రభావం జాతీయ రాజకీయాల పై, ముఖ్యంగా పొరుగున ఉన్న ఆంధ్ర రాష్ట్రం పైనా భారీగా పడుతుంది. అయితే ఈ ప్రభావం ఎవరికి అనుకూలిస్తుందనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు రానని, మీరే చూసుకోవాలని తెలంగాణ నాయకులకు చెప్పారు. కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడిన తర్వాత తొలుత ఖమ్మంలో ప్రచారం నిర్వహించి ప్రతిస్పందన చూశారు. ఖమ్మంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో, హైదరాబాద్‌లో కలియ తిరిగారు. హైదరాబాద్‌లోనూ ఆదరణ లభించడంతో, రాష్ట్ర పాలనపై, టీఆర్‌ఎస్ నాయకత్వంపై గళం పెంచారు.
తెలంగాణ ఓటర్లు ఎటువంటి తీర్పు ఇవ్వనున్నారు? అనేది 11వ తేదీన తేలిపోనున్నది. టీఆర్‌ఎస్ తిరిగి అధికారం చేపడితే ఆంధ్ర ఓటర్లపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?, ఒకవేళ కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని ప్రజా కూటమి అధికారాన్ని చేపడితే అక్కడ రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయనే అంచనాలు, చర్చ జరుగుతున్నది. కూటమి విజయం సాధిస్తే ఆంధ్రలో అనూహ్యంగా రాజకీయాలు మారుతాయి. ఫలితంగా ఓటర్ల పై ప్రభావం పడుతుంది. ప్రజా కూటమి విజయం సాధిస్తే నాలుగైదు నెలల్లో ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఈ కాంబినేషన్ హిట్ అవుతంది అనే నమ్మకం కలిగి, చంద్రబాబు ఫ్రంట్ లో మరిన్ని పార్టీలు వచ్చి చేరతాయి.
తెలంగాణ ఓటర్ల తీర్పు తర్వాత ఆంధ్రలో తప్పని సరిగా రాజకీయ సమీకరణలు మారుతాయి. కూటమి ఆంధ్రలోనూ ఏర్పడితే, దానిని ఎదుర్కొవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పావులు కదుపుతారు. అప్పుడు ఆయన శతృవుకు శతృవు మిత్రుడు అన్న చందంగా బీజేపీతో దోస్తీ చేస్తారా?, అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జన సేన పార్టీనీ కలుపుకుని వెళతారా? అనే కోణంలోనూ పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు ప్రభృతులూ ఆంధ్రకు వెళ్ళి జగన్‌కు బాసటగా నిలిచే అవకాశమూ లేకపోలేదు.మొత్తానికి ఇప్పుడు రహస్యంగా ఉన్న మిత్రులు అందరూ, బహిరంగంగా వచ్చి చంద్రబాబు మీద దాడి చేస్తారు. చూద్దాం ప్రజలు ఏమి చేస్తారో.