ఎందుకో ఏమో కానీ, చిత్ర విచిత్రాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతాయి. ఇది నిజం అని ప్రజలను నమ్మిస్తారు, చివరకు అది భ్రమగా తేల్చేస్తారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విన్యాసాలు చేయటంలో ముందు ఉంటుంది. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని, కింద నుంచి పైదాకా వీళ్ళు మాట్లాడిన మాటలు చూసి, ఇప్పుడు వీళ్ళు మూడు ముక్కలాట చూసిన తరువాత, మాట తప్పను, మడమ తిప్పను అనే దానికి ఇక విలువ ఏమి ఉంటుంది ? తరువాత మొన్న మధ్య, నాకు 151 మంది ఉన్నారు, శాసనమండలిలో నన్నే ఆపుతారా అంటూ, ఏకంగా శాసనమండలిని రద్దు చేసి పడేసారు. శాసనమండలి మీద రూపాయి ఖర్చు పెట్టినా దండగ అని జగన్ తేల్చి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వరుస పెట్టి శాసనమండలిలో ఖాళీలు పూరిస్తున్నారు. ఇలాంటివి కనీసం ఒక 20 ఉంటాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయం తీసుకుందాం. ఇది కూడా అంతే. నిమ్మగడ్డ నా మాట వినటం లేదని, గవర్నర్ ని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. అందులో రిటైర్డ్ జడ్జిలు ఉండాలని, షరతు పెట్టారు. ఆర్డినెన్స్ ఆమోదించి, నిమ్మగడ్డను తీసేసి, కనకరాజ్ ను పెట్టారు. ఇది తరువాత కోర్టు కొట్టేసింది అనుకోండి. అయితే ఈ సందర్భంగా వైసీపీ నేతలు చెప్పిన కబురులు ఇంకా చెవుల్లో తిరుగుతూ ఉండగానే, ఇప్పుడు మడమ తిప్పెసారు.
అసలు ఇదో పెద్ద గొప్ప సంస్కరణ అని అంబటి, కొడాలి నాని లాంటి వాళ్ళు ఊదరగొట్టారు. ఐఏఎస్ లు అయితే, రాజకీయ నాయకులు చెప్పిన మాట విని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తారని, అందుకే ఈ పదవిని కేవలం మూడేళ్ళు పెట్టి, రిటైర్డ్ జడ్జిని పెట్టాలని మా జగన్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒక అడుగు ముందుకు వేసి, కనకరాజ్ దళితుడు అని కూడా చెప్పారు. బ్లూ మీడియా, పేటీయం సోషల్ మీడియా మొత్తం, ఊదరగొట్టారు. కొంత మంది ప్రజలు, నిజమే ఇదో గొప్ప నిర్ణయం అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మడమ తిప్పెసారు. మాట తప్పేసారు. నిమ్మగడ్డ పదవీ కాలం ముగియటంతో, ఇప్పుడు మళ్ళీ కనకరాజ్ ని నియమిస్తారని అనుకున్నారు అందరూ. అయితే మళ్ళీ అదే ఐఏఎస్ అయిన నీలం సాహనీకి ఇచ్చారు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు ఏమిటి ? నీలం సాహనీ ఏ కోర్టుకి జడ్జిగా పని చేసారు అంటే ఏమి సమాధానం చెప్తారు. ఇలా అనేక ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే, వైసిపీ తప్పించుకుని తిరుగుతుంది. చెప్పేటందుకే నీతులు అని, మన పెద్దలు ఊరికే అనలేదు. అవి పాటించకుండా, ఎదుటి వాడిని తిడుతూ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అయిపోతుందా ? దీన్నే మాట తప్పటం, మడమ తిప్పటం అంటారు.