ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపటం లేదు అంటూ, గత ఏడాది దాఖలు అయిన పిటీషన్ పై, గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఎన్నికలు జరపమని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల వరకు వెళ్ళింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచం మొత్తానికి క-రో-నా వచ్చి ఇబ్బంది పెట్టటంతో, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ప్రారంభించింది. దీంతో రోజు రోజుకీ ముప్పు ఎక్కువ అవ్వటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేసింది. అయితే ఈ కేసు మరో సారి మొన్న హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్బంగా విచారణ చేసిన హైకోర్టు ఎందుకు ఎన్నికలు జరపటం లేదు అని అడగగా, ప్రభుత్వం తరుపు న్యాయవాది క-రో-నా ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితిలో ఎన్నికలు జరపలేమని తేల్చి చెప్పారు. అయితే దీని పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధం అవుతున్నారు కదా, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలే కదా అంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చి, వారి అభిప్రాయం కోరింది. ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయం చెప్పాలి అంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
దీంతో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ ఏమి చెప్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. ఆయన మేము ఎన్నికలు ఈ సమయంలో జరపలేం అంటే ఇబ్బందే ఉండదు. అదే ఎన్నికలు జరపే అవకాసం ఉందని చెప్తే మాత్రం, మళ్ళీ ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఆసక్తిగా మారింది. మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తమ అభిప్రాయం చెప్పే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గతంలో అంటే వాయిదా కాబట్టి ప్రభుత్వ సహకారం అవసరం లేదు, ఇప్పుడు ఒక వేళ ఎన్నికలు జరపాలి అంటే మాత్రం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ సహకారం అవసరం అవుతుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందా, లేకపోతే పరిస్థితి అంచనా వేసి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధత ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం ఇది ఏమి అవుతుందో.