తెల్ల రేషన్ కార్డులను జారీ చేసేందుకు అర్హత ఆదాయ పరిమితిని పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసే వీలు ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు జారీకి గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం 60 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం 75 వేల రూపాయలు కలిగి ఉండాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా వార్షికాదాయ పరిమితిని పెంచలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల పేదల ఆదాయం కొంత మేరకు పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా 1.42 లక్షల రూపాయలకు చేరుకుంది.
ఆదాయం పెరగడం వల్ల చాలామంది తెల్ల రేషన్ కార్డులను పొందేందుకు అనర్హులు అవుతున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. మరింత మందికి తెల్లరేషన్ కార్డు జారీకి అర్హత కల్పించేందుకు వీలుగా వార్షికాదాయ పరిమితిని పెంచే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుల జారీకి గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం 1.2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షల రూపాయలకు పెంచే అంశం పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావచ్చని భావిస్తున్నారు.