ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో ఆయన అభిమాని చేసిన దాడి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. దాడి జరిగింది ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపైన, దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు ఆయన వీరాభిమాని. కోడి కత్తితో దాడి జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స చేయించుకుని ఎయిర్‌పోర్టులో ఉన్నవారిని నవ్వుతూ పలకరించుకుంటూ జగన్మోహన్‌రెడ్డి విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చేశారు. ఆ తర్వాత నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పనిలో పనిగా గవర్నర్ నరసింహన్‌ను కూడా కడిగి పారేశారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర పన్నారని తీవ్ర స్వరంతో విమర్శించారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. అయితే కోడి కత్తితో తనపై దాడి జరగ్గానే ప్రాథమిక చికిత్స చేయించుకుని హుందాగా వెళ్లిపోయిన జగన్మోహన్‌రెడ్డి చివరికంటా అదే హుందాతనాన్ని ప్రదర్శించి ఉంటే ఆయన ఇమేజ్ పెరిగి ప్రజల్లో మంచి పేరు వచ్చి ఉండేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. లేదా జరిగిన సంఘటనను ఆసరాగా చేసుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే విశాఖపట్టణంలోని ఏ ఆస్పత్రిలోనో చేరి ఉంటే వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చేవారు. మంచి మైలేజీ వచ్చి ఉండేది. అలా కాకుండా పొరుగు రాష్ట్రం వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరడం వల్ల రాజకీయ ప్రయోజనం కూడా సిద్ధించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇదే విషయం వైసీపీలో కూడా చర్చనీయంసం అయ్యింది. దాడి జరగగానే, వచ్చిన ఫోటోలలో జగన్ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో, చూసారా మా అన్న, ఎంత ధీమాగా ఉన్నారో, ఎక్కడా రాజకీయం చెయ్యకుండా వెళ్ళిపోయారు అని సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అయితే, రెండు- మూడు గంటలు ఆగిన తరువాత, జగన్ నాటకాలు చూసి, వీళ్ళు కూడా అవాక్కయ్యారు. ఉన్నట్టు ఉండి, జగన్ మంచం మీద అడ్డం పడటం, కళ్ళు తెరవకపోవటం, ఇవన్నీ ఎవరో చెప్తే చేసారని, అది ఎవరా అని సొంత పార్టీ నేతలే ఆరా తీస్తున్నారు. కోడి కత్తితో జరిగిన దాడి వల్ల జగన్‌కు రాజకీయంగా ఉపయోగం కలిగిందో లేదో ఆ పార్టీ వాళ్లు చెప్పాలి గానీ ‘‘నేను ఆంధ్రా పోలీసులను నమ్మను..’’ అని జగన్ చేసిన ప్రకటన మాత్రం ఆయనకు నష్టమే చేసింది. ‘ఆంధ్రా పోలీసులను నమ్మను– తెలంగాణ పోలీసులను నమ్ముతాను’ అన్న వ్యక్తికి ఆంధ్రా ప్రజలపై మాత్రం ఎందుకు నమ్మకం ఉంటుంది అన్న వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి.