వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి పై విచారణ మూడో రోజుకి చేరింది. ఠాణేలంక పెదపేటలోని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి సోదాలు చేసి.. తండ్రి తాతారావు, తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజును సిట్ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. శ్రీనివాసరావు 20 రోజుల క్రితం మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు జరిగిన ప్రాంతంలో గోదావరి ఒడ్డున కొంతమంది స్నేహితులకు శ్రీనివాసరావు భారీ విందు ఇచ్చాడని.. ఆ విందుకు ఒక యువతిని కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విందుకు రూ.40 వేల వరకు చెల్లించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు.. అక్కడ ఏం మాట్లాడుకున్నారనే విషయాలపై సిట్ ఎస్ఐ వెంకట్రావు ఒక్కొక్కరినీ విడివిడిగా విచారిస్తున్నారు.
శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, కాల్‌డేటా పరిశీలనలో అతడు ఏడాదిలో పదివేల కాల్స్ మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. వందమందితో ఎక్కువసార్లు సంభాషించాడని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. శ్రీనివాసరావుతో తరచూ మాట్లాడిన వారెవరు? ఏ అంశాలపై మాట్లాడారు? అన్నది కూపీ లాగుతున్నారు. వైకాపా కార్యాలయంలో విధులు నిర్వర్తించే ‘కె.కె.’ అనే వ్యక్తితోనూ ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలడంతో పోలీసులు అతన్ని సోమవారం విమానాశ్రయ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. దీంతోపాటు విమానాశ్రయంలోని రెస్టారెంట్లో పనిచేసే ముగ్గురు యువతుల సెల్ఫోన్ల నుంచి కూడా శ్రీనివాసరావు మాట్లాడాడని తేలడంతో వారినీ విచారించారు.
నిందితుడికి ప్రాథమికంగా మూడు బ్యాంకు ఖాతాలున్నాయని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఆంధ్రాబ్యాంకు ఖాతాలో సున్నా, విజయా బ్యాంకులో రూ.350, ఎస్బీఐలో కేవలం రూ.56 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇంత తక్కువ మొత్తాలపై పోలీసులు విస్మయానికి గురయ్యారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజుకు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో రూ.80 వేలున్నట్లు గుర్తించారు. ఈ నగదు ప్రైవేటు వడ్డీ వ్యాపారినుంచి వచ్చినట్లు సమాచారం. శ్రీనివాసరావు తల్లి సావిత్రి, వదిన బేబిలకు ఠాణేలంక ఎస్బీఐ కియోస్క్‌లో ఖాతాలున్నాయి. ఉపాధిహామీ పథకం, గ్యాస్రాయితీ వంటి సొమ్ములు మినహా వాటిలోకి భారీగా నగదు బదిలీ జరిగే అవకాశం లేనందున అధికారులు వాటిని పరిశీలించలేదని తెలిసింది. శ్రీనివాసరావు తండ్రి జనిపల్లి తాతారావు పేరున రూ.2 లక్షల రుణం మంజూరు కాగా ఇప్పటివరకు రూ.1.15 లక్షలవరకూ బిల్లు చేసినట్లు గృహనిర్మాణ అధికారులు వివరించారు.