జగన్ మొండి వాడు, ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, వెనక్కు తగ్గేది లేదు, ఎవరు చెప్పినా వినరు, ఆయన నైజం తెలిసిన వాళ్ళు ఎవరూ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం చెయ్యరు, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా, జగన్ మాట వినాల్సిందే.. ఇది వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, జగన్ గురించి చేసే ప్రచారం. అయితే అనేక సందర్భాల్లో జగన్ మాట మార్చారు అనుకోండి అది వేరే విషయం. అయితే, నిన్న కీలకమైన రాజధాని విషయంలో, ఏమి జరిగిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. మూడు రాజధానుల నిర్ణయం పై, నిన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు అంటూ, ప్రచారం హోరెత్తించారు. అంతే కాదు, దానికి తగ్గట్టు వైసీపీ చేసిన హడావిడి కూడా అంతా ఇంతా కాదు. ఒక పక్క ప్రభుత్వం, అమరావతిలో 144 సెక్షన్ పెట్టటం, మనిషికి ఒక పోలీసు, టియర్ గ్యాస్ వ్యాన్ లు, వాటర్ క్యానన్లు, ఫైర్ ఇంజిన్లు, ఇలా ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇక మరో పక్క వైసీపీ పార్టీ, విశాఖపట్నంలో చేస్తున్న హడావిడి కూడా అంతా ఇంతా కాదు.
కనీవినీ ఎరుగని రీతిలో, 24 కిమీ మానవహారం ఏర్పాటు చేసి, జగన్ కు భారీ స్వాగతం పలకాలని, నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అమరావతిలో, అక్కడ వైజాగ్ లో వాతావరణం చూసిన అందరూ, ఇక క్యాబినెట్ లో, మూడు రాజధానులకు ఆమోదం తెలుపుతారని, డిసైడ్ అయిపోయారు. అందరూ మానసికంగా రెడీ అయ్యారు. అమరావతి ప్రాంత ప్రజలు, భారీ ఆందోళనకు సిద్ధం అయ్యారు. అయితే, క్యాబినెట్ సమావేశ వివరాలు చూసి, ఇప్పుడే రాజధాని పై నిర్ణయం తీసుకోమని, మరో కమిటీ రావాలని, ఆ కమిటీ పై ఇంకో కమిటీ వేస్తామని చెప్పటంతో, అందరూ షాక్ అయ్యారు. ఇంత హడావిడి చేసి, జగన్ స్వభావం తెలిసి, ఇలా వెనకడుగు ఎందుకు వేసారో ఎవరికీ అర్ధం కాలేదు. ఎక్కువ టైం ఇచ్చే కొద్దీ, అమరావతి ఉద్యమం ఊపు అందు కుంటుందని, తెలిసినా, ఇలా ఎందుకు చేసారు అంటూ గుసగుసలు మొదలయ్యాయి.
ఎవరో బలమైన వ్యక్తీ ఒత్తిడి లేకపోతే, జగన్ ఇలా వెనకడుగు వెయ్యరనే ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ లెవెల్ లో ఏదో జరిగిందని, దానికి బలం చేకూరుస్తూ జరిగిన సంఘటనలు ఉదహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం వెంకయ్య నాయుడు, నేను ఎవరికి చెప్తానో వారికి చెప్తాను అని చెప్పటం, నిన్న సుజనా చౌదరి రాష్ట్రపతిని కలవటం, అమిత్ షాకి ఈ విషయం పై ఫిర్యాదులు వెళ్ళటం, ఇవన్నీ ఉదహరిస్తున్నారు. అయితే వీటి అన్నిటితో పాటుగా, నిన్న కేంద్ర మాజీ మంత్రి జగన్ తో గంట పాటు సమావేశం అవ్వటం కూడా, ఈ విషయం పైనే అని తెలుస్తుంది. కేంద్రం దూతగా ఆయన వచ్చారనే ప్రచారం జరుగుతంది. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కాదు. అలాంటిది గంట పాటు సమావేశం అవ్వటం చూస్తే ఏదో ఉందనే చెప్తున్నారు. మొత్తంగా ఢిల్లీ లెవెల్ లో అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావటంతో, జగన్ ప్రస్తుతానికి వెనకడు వేసారని, త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి, ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి, దీని పై ముందుకు వెళ్తారని సమాచారం.