ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రతిసారి దగా చేయబడుతూనే ఉంది. ఈ దేశ పార్లమెంట్ సాక్షిగా, మనకు ఇష్టం లేకపోయినా మనల్ని విడగొట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా మనలను చేసారు. కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ ని వదులుకున్నాం. సరే అయ్యింది ఎదో అయిపొయింది అనుకుని, మనకు రావాల్సిన హక్కుల పై పోరాడాం. ఈ పోరాటంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సహకరించింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంది. 5 ఏళ్ళు కాదు, పదేళ్ళు కావాలని అడిగింది. ఎవరో కాదు, ప్రధాని మాత్రమే హామీ ఇవ్వాలని పట్టుబట్టి, మన్మోహన్ చేత ప్రకటన ఇప్పించారు. తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం వచ్చింది. హమ్మయ్య అనుకున్న ఆంధ్రులు, కుదుట పడతాం అనుకున్నారు. అనుకున్నట్టే అమరావతి రైతుల త్యాగ ఫలం అమరావతి వచ్చింది. పోలవరం పునాదుల్లో నుంచి పైకి లెగిసింది. ఇలా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వస్తున్న వేళ, కేంద్రం పెద్దలు అడ్డు పుల్లలు మొదలు పెట్టారు. ముందుగా స్పెషల్ స్టేటస్ పై వంచన చేసారు. ప్యాకేజి అని ఒప్పించారు. సరే ప్యాకేజికి చట్టబద్ధత ఇస్తామని మోసం చేసారు. విద్యా సంస్థలకు అరకొర నిధులు ఇస్తున్నారు. ఇక వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజి ఆపేశారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అని 1500 కోట్లు ఇచ్చారు. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇలా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టటంతో, చంద్రబాబు కేంద్రం పై పోరాటం మొదలు పెట్టారు. మోడీ, అమిత్ షా ని దేశ వ్యాప్తంగా తిరిగి, వీళ్ళు చేస్తున్న పనుల పై నిలదేససారు. అయితే రాజకీయ సమరంలో చంద్రబాబు ఓడిపోయారు. మోడీ, అమిత్ షా ని రాష్ట్రం కోసం నిలదీసిన చంద్రబాబు రాజకీయంగా బలహీనుడు అయ్యాడు. దీంతో రాష్ట్ర సమస్యల పై ఢిల్లీని నిలదీసే వారే లేరు.
ఇదే సందర్భంలో కేంద్రం మెడలు వంచేస్తాను అంటూ ఎన్నికల ముందు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, అధికారం వచ్చిన తరువాత సైలెంట్ అయ్యారు. మెడలు వంచుతారు అనుకుంటే, సార్ ప్లీజ్ అనటం తప్ప మనం ఏమి చేయలేం అంటున్నారు. ఇదే అలుసు అనుకున్నారో ఏమో, ఢిల్లీ పెద్దలు విభజన హామీల పై , ఈ 18 నెలల్లో ఏమి మాట్లాడటం లేదు. అమరావతి నిర్వీర్యం అయిపొయింది, అయినా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పోలవరం పై పిడిగు లాంటి వార్త చెప్పింది కేంద్రం. చంద్రబాబు హయంలో కేంద్ర జల శక్తి చేత 55 వేల కోట్లకు పోలవరం అంచనాలు ఆమోదిస్తే, ఇప్పుడు దాన్ని 20 వేల కోట్లకు తెచ్చారు. అయినా జగన్ గారు ఏమి మాట్లాడటం లేదు. జగన్ గారికి సన్నిహితంగా ఉండే ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా, పోలవరం పై ఇలాంటి అడుగులు వేస్తున్న నువ్వు ఎందుకు అంటున్నారు అంటే, జగన్ చేస్తున్న తప్పు ఏమిటో అర్ధం అవుతుంది. అయినా ఇక్కడ అనాల్సింది కేంద్రాన్ని. ఇక్కడ నష్టపోయింది చంద్రబాబు, జగన్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మోడీని నిలదీసే చంద్రబాబు , రాజకీయంగా బలహీనుడు అయ్యాడు, రాజకీయంగా బలంగా ఉన్న జగన్ గారు, నోరు తెరాటం లేదు. దీంతో కేంద్ర పెద్దలు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది తగునా ? ఈ దెస పార్లమెంట్ లో చెప్పిన దానికి విలువ లేదా ? మీ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు బలి అవ్వాలి. అమరావతి మూడు ముక్కలు అయితే మీకు సంబంధం లేదా ? పోలవరం 55 వేల కోట్లతో కట్టల్సింది, 20 వేల కోట్లతో ఎలా కడతారు ? స్టేటస్ లేకుండా, కొత్త రాష్ట్రం ఎలా నిలదొక్కుకుంటుంది ?