ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నామినేషన్లు వేయడం, ఉపసంహరించుకోవడం, బెదిరింపులు, దాడులకు పాల్పడటం చూస్తుంటే, దేశచరిత్రలో ఏముఖ్యమంత్రి కూడా పాల్పడని కార్యక్రమాలకు జగన్ పాల్పడుతున్నట్లుగా అనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పక్క రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు, మూసేసి, ముఖ్యమంత్రి, మంత్రులు కరోనాను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, అన్ని రాష్ట్రాలు, దేశాలు కరోనా కట్టడి కోసం ముందుకు కదులుతుంటే, ఏపీ ముఖ్యమంత్రి మాత్రం దానిపై నోరు తెరిచి సమాధానం చెప్పలేదని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. 5కోట్ల ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుందో చెప్పకుండా, ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో పబ్జీ గేమ్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ఓట్లేయడానికి ప్రజలంతా అర్థరాత్రి దాటినా తెల్లారేవరకు క్యూలైన్లలో నిలబడి ఓట్లేశారని, అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలంతా ఓట్లు వేయడానికి బారులు తీరుతారని, ఈ పరిస్థితుల్లో కరోనా నిరోధానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత సీ.ఎస్ కు లేదాఅని దేవినేని నిలదీశారు.
ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అధికారులు ఏంచేస్తున్నారో, ఎలాంటిచర్యలు తీసుకున్నారో ఎందుకు చెప్పడంలేదన్నారు. వైరస్ ప్రభావం నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుందో, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వివరణ ఇవ్వడంలేదన్నారు. నెల్లూరులో కరోనా కలకలమని, భయంకరోనా అని పత్రికల్లో కథనాలు వచ్చాయని, దానిపై సీఎం ఎందుకు స్పందించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది విదేశీయులు ఉన్నారు...ఎక్కడినుంచి వస్తున్నారు... వారి ఆరోగ్య పరిస్థితేంటి.. ఎన్ని మాస్కులున్నాయి.. ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు ఎందుకు ప్రజల ముందుంచడంలేదని దేవినేని నిలదీశారు. గత పదిరోజులుగా విదేశాలనుంచి ఎంతమంది రాష్ట్రంలోకి వచ్చారో ఎందుకు చెప్పడంలేదన్నారు? రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి, తన ఇంటి ముందుకూర్చొని ఎన్నికల్లో టిక్కెట్లు పంచుతూ బిజీగా ఉంటే, ఇతరమంత్రులంతా నామినేషన్ల పత్రాలు చించుతూ, బెదిరింపులకు దిగుతున్నారని దేవినేని ఎద్దేవాచేశారు.
ప్రభుత్వానికి బుద్ది, జ్ఞానం ఉందా...ఉంటే ఇంత జరుగుతుంటే ఏం చేస్తోందని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వివిధప్రాంతాలనుంచి, దేశవిదేశాల నుంచి రాష్ట్రానికి వస్తారని, వారందరి ఆరోగ్యస్థితి దృష్ట్యా జగన్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందో చెప్పాలన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే, రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటే, తాడేపల్లి చక్రవర్తి పబ్జీ గేమ్ లు ఆడుకుంటున్నాడన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి, ప్రపంచఆరోగ్య సంస్థనుంచీ హెచ్చరికలు వస్తుంటే, అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దునిద్రపోతోందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేవేళ కరోనా వ్యాప్తి చెందినా, దానివల్ల ఎవరైనా మరణించినా ముఖ్యమంత్రి జగనే బాధ్యుడని, ఒక్కనెలలో ఎన్నికలు మొత్తం నిర్వహించి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించేసుకొని, వచ్చే ఎన్నికల్లో విశాఖకు తరలిపోవాలన్న తాపత్రయంతోనే ఆయన పనిచేస్తున్నాడన్నారు.