గత బడ్జెట్ సమావేశాలలో, ఒక్క రోజు కూడా లోక్‌సభ సమావేశాలు జరగలేదు. అవిశ్వాసం పై చర్చకు తెలుగుదేశం పార్టీ పట్టుబట్టటంతో ప్రతి రోజు, సమావేశం వాయిదా వేసుకుని వెళ్ళిపోయే వారు. దీనికి తెరాస, అన్నాడీయంకే సభ్యుల గొడవ సాకుగా చూపించారు. దీంతో అవిశ్వాసం పై మోడీ వెనుకడుగు వేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అయితే, పోయిన సారి అవిశ్వాసం పై చర్చకు ఒప్పుకోని మోడీ, ఈ సారి మాత్రం, మొదటి రోజే, అవిశ్వాసానికి సై అంటున్నారు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రతి సారి అవిశ్వాసం పై చర్చ చేపట్టకపోతే, ఇక మోడీ అనే వాడు పిరికిపందగా చరిత్రలో మిగిలిపోతాడు. ముందస్తు ఎన్నికల నేపధ్యంలో, ఈ సమావేశాలు చివరివి అయ్యే అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వం చాలా బిల్లులు ఆమోదించుకోవాలి. ఇది ఒక కారణం అయితే, రెండో కారణం, ఈ సారి గొడవ చెయ్యకపోవటానికి ఏ పార్టీ దొరక్కపోవటం.
గత బడ్జెట్ సమావేశాల్లో ఏఐఏడీఎంకె, తెరాస లాంటి పార్టీలతో గొడవ చేపించారు. ఈ సారి గొడవ చేసే అవకాశం లేదు. ఇటీవల కావేరి బోర్డు ఏర్పాటుతో ఏఐఏడీఎంకె సమస్య తీరిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరే పార్టీ కూడా వెల్‌లోకి వచ్చి ఆందోళనచేసి అధికార పార్టీతో అంటకాగుతోందన్న అపవాదును వేసుకోవడానికి తెరాస సిద్ధంగా లేదు. దీంతో అవిశ్వాసాన్ని అడ్డుకోవడానికి భాజపా చేతుల్లో అస్త్రం లేకుండాపోయింది. ఇక మరోకటి, సభలో మెజారిటీ. మొన్నటి దాక బీజేపీకి బొటా బోటీ మెజారిటీ ఉంది. దీంతో అద్వానీ వర్గంలోని 4-5 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ సారి వైసీపీ ఎంపీలు రాజీనామా చెయ్యటంతో, హాఫ్ వే మెజారిటీ మార్క్ మరింత తగ్గటంతో, బీజేపీ ఇప్పుడు సంపూర్ణ మెజారిటీతో ఉంది, ఒకరిద్దరు వ్యతిరేకంగా ఓటు వేసినా, వారికి నష్టం ఉండదు. పైగా మొన్నటి దాక ఎదురు తిరిగిన శివసేన, ఇపుడు లైన్ లో కి వచ్చింది. అందుకే, అన్నీ చూసుకుని, ఇప్పుడు మోడీ సై అంటున్నారు.
అవిశ్వాసంపై చివరగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించే అవకాశం ఉందని భాజపా నాయకులు పేర్కొంటున్నారు. దేశంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అదే కాబట్టి మోదీ గురి అంతా కాంగ్రెస్‌పైనే ఉంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన విమర్శల జోలికి వెళ్లకుండా... ఆ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాం, చట్టంలో చెప్పినవన్నీ చేస్తామని మాత్రమే చెప్పే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. తెలుగుదేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించకుండా చేయడానికి మోదీ ఈ అంశంపై తక్కువగా మాట్లాడొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి భాజపాకు ఇద్దరు సభ్యులున్నప్పటికీ అందులో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తారని పేర్కొంటున్నారు.