వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... 10 ఏళ్ళు సియం కుర్చీ కోసం తన రాజకీయ జీవితం గడిపి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి, ఆ కుర్చీ సాధించారు. 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. ఆయనకు రాజకీయంగా తిరుగులేదు. ప్రతిపక్షాలను ఆడుకుంటూ, ఆడతా పడతా పని చేసుకుంటూ ముందుకు పోవచ్చు. ఆదాయం లేకపోయినా వేల కోట్లు అప్పు తెచ్చి, పంచేస్తున్నారు కాబట్టి, ఆర్ధికంగా కూడా ఇబ్బంది లేదు. పైన కేంద్రం కూడా సహకరిస్తుంది. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఆడతా పాడతా పరిపాలన చేసుకుంటూ, ప్రతిపక్షాలతో ఆడుకుంటూ గడిపేయవచ్చు. కానీ, జగన్ గారు మాత్రం, కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. అనవసర విషయాల పై చర్చ పెట్టి, తన బలహీనతను బయట పెట్టుకుంటున్నారు. అలాగే నాకేంటి అనే ఇగోతో కూడా చాలా కష్టాలు వస్తున్నాయి. ఉదాహరణకు, అసలు ఎన్నికల కమీషనర్ తో గొడవ ఎందుకు ? ఆ ఇష్యూ ఆరు నెలల పాటు సాగ తీసుకోవటం అవసరమా ? విశాఖలో ఉండే ఒక చిన్న డాక్టర్ విషయం రచ్చ చేసి, సిబిఐ దాకా తెచ్చుకున్నారు. అలాగే అమరావతిని మూడు ముక్కలు చేసే విషయం. ఇంగ్లీష్ మీడియం విషయం కూడా. తెలుగు మీడియం ఆప్షన్ పెడితే అయిపోయే దానికి, రచ్చ రచ్చ చేసారు.
ఇప్పుడు తాజాగా తిరుమల విషయం. జగన్ మోహన్ రెడ్డి ఇది వరకు ఒక పార్టీ అధినేత. ఆయన ఏమి చేసిన చెల్లుతుంది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి. అందరినీ గౌరవించాలి. తిరుమలకు అన్య మతస్తులు వెళ్ళే సమయంలో, డిక్లరేషన్ ఇవ్వటం అనేది చట్టం. కొత్తగా వచ్చింది కూడా. కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. గతంలో రాష్ట్రపతి లాంటి వాళ్ళు కూడా సంతకం పెట్టారు. నాకు వెంకన్న మీద విశ్వాసం ఉంది అని సంతకం పెడితే అయిపోయే దానికి, ఇంత గోల చేస్తున్నారు. దాని కోసం వైవీ సుబ్బారెడ్డి, రూల్స్ మార్చేస్తున్నట్టుగా, ఎవరూ సంతకం చెయ్యాల్సిన పని లేదు అని చెప్పటం, రెండు రోజులు గోల అవ్వటంతో, అలా అనలేదు, కేవలం జగన్ గారికి అవసరం లేదు అని చెప్పానని అన్నారు. ఇది సద్దుమణిగిందో లేదో, కొడాలి నాని ప్రెస్ ని ఇంటికి పిలిపించుకుని మరీ, ఎవరు పెట్టారు ఇది, తీసి పారేయండి అంటూ మళ్ళీ వివాదం రేపారు. చిన్న సంతకంతో, అయిపోయే దాన్ని, ఎందుకు ఇంత వరకు తెచ్చుకుంటున్నారు ? జగన్ గారికే తెలియాలి.