రాజధాని అమరావతి పరిరక్షణకు బౌద్దులు రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత రాజధాని అమరావతికి సమీపంలోనే బౌద్ధ క్షేత్రం ఉంది. ఈ నేపధ్యంలోనే ఎంతో చారిత్రాత్మకమైన ఈ ప్రాంతం నుంచి తరలిపోకుండా చూడాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త దలైలామా సహకారం కోరాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే అమరావతి బుద్ధ విహార కేంద్ర కార్యదర్శి సుధాకర్ మేడసాని, దలైలామా అపాయింట్మెంట్ కోరుతూ తాజాగా లేఖ రాశారు. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ కేంద్రం అమరావతి నుంచి రాజధాని విశాఖపట్నంకు తరలించడం పై పూర్తి వివరాలతో ఒక విజ్ఞాపన పత్రం స్వయంగా అందజేయాలని నిర్ణయించినట్లు సుధాకర్ దలైలామాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమరావతికి ఆశీర్వచనాలు కావాల్సిందిగా దలైలామాను ఆ లేఖలో అభ్యర్థించారు. దలైలామా నుంచి అనుమతి రాగానే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు వెళ్లి అమరావతిపై స్వయంగా వినతిపత్రం ఇవ్వనున్నట్లు సుధాకర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అమరావతి ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అమరావతికి దలైలామా ప్రశంసలు కూడా ఉన్నాయి. "అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించటం స్వాగతించదగిన పరిణామం. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చారిత్రక నగరం రానున్న రోజుల్లో ఎంతో మార్పు చెందుతుంది. శాంతి వెల్లివిరిసిన చోటే ఆర్థిక ప్రగతి ఉంటుంది" అని దలైలామా 2017వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో రాజధాని అమరావతిని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు 2006వ సంవత్సరం జనవరి 9వ తేదీన అమరావతిలో జరిగిన కాలచక్ర మహాసభలకు హాజరయ్యారు. ఈ విధంగా అమరావతితో దలైలామాకు ఎంతో అనుబంధం ఏర్పడిందని బౌద్ధుల నమ్మకంగా ఉంది.
ఈ నేపధ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన అమరావతి పేరుతో నిర్మితమైన రాజధాని తరలిపోకుండా నిలువరించటంలో దలైలామా ఆశీస్సులు కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది. దలైలామా కనుక ఈ విషయం మీద శ్రద్ధ పెడితే, అటు కేంద్రానికి కూడా ఒత్తిడి పెరిగే అవకాసం ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో, స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చెయ్యటం, అలాగే ఆయన కూడా ఇది శాంతికి నిర్వచనమైన బౌద్ధ నేల అంటూ చెప్పటం కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో, అమరావతిని నిర్వీర్యం చెయ్యాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, ఇప్పుడు దలైలామా సహాయం కోరాలని, అమరావతి బుద్ధ విహార కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.