మన దేశంలో ప్రస్తుతం పీడిస్తున్న ప్రధాన సమస్య, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం. కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులతో కలిసి తడిసి మోపెడు అవుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఇతర నిత్యావసరాల మీద కూడా పడింది. దీంతో ప్రజలు విసిగెత్తి పోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వానికి సెగ అర్ధం అయ్యింది. దీంతో వారు కిందకు దిగి రాక తప్పలేదు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో, ప్రజలకు కొంత ఉపసమనం ఇచ్చారు. పెట్రోల్‍పై రూ.5, డీజిల్‍పై రూ.10 వరకు పన్నులు తగ్గించారు. దీంతో కొంత వరకు ఉపసమనం అనే చెప్పాలి. రవాణా ఖర్చులు కొంత మేర తగ్గుతాయి కాబట్టి, ఇతర రేట్లు కూడా దిగి వచ్చే అవకాసం ఉంది. ఈ సవరించిన రేట్లు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించటంతో, ఇతర రాష్ట్రాలు కూడా వారి వైపు ఉన్న పన్నులు తగ్గిస్తూ, నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఇది నిజంగా ప్రజలకు దీపావళి కానుక అనే చెప్పాలి. చాలా రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పై రాష్ట్ర పన్నులు తగ్గిస్తూ నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నులు కూడా తగ్గటంతో, ప్రజలకు ఉపసమనం లభించింది.
అస్సాం రాష్ట్రం అయితే, ఏకంగా రూ.7 తమ రాష్ట్ర పన్నులు తగ్గించింది. అలాగే గోవా కూడా రూ.7 తగ్గించింది. గుజరాత్ తగ్గిస్తాం అని చెప్పింది కానీ, ఎంతో చెప్పలేదు. ఇక త్రిపురా రాష్ట్రం కూడా రూ.7 తగ్గించింది. మణిపూర్ రాష్ట్రం కూడా రూ.7 తగ్గించింది. ఢిల్లీ ప్రభుత్వం, పెట్రోల్ పై రూ.6.07 , డీజిల్ పై రూ.11.75 తగ్గించి ప్రజలకు ఉపసమనం కలిగించింది. మన పక్కన ఉన్న కర్ణాటక కూడా రూ.7 తగ్గించింది. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తర ప్రదేశ్, రూ.12 తగ్గించింది. ఇక హర్యానా రాష్ట్రం కూడా రూ.12 తగ్గించింది. ఇలా అన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర వాటా కూడా తగ్గించటంతో, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పెట్రోల్ 90 రూపాయలకు వచ్చింది అనే చెప్పాలి. మరి అందరి కంటే ఎక్కువ పన్నులు బాదుతున్న జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడు ధరలు తగ్గిస్తారు అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు ? పెట్రోల్ పై దాదాపుగా 30 రూపాయాల పన్ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. అలాగే డీజిల్ పై కూడా 22 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు నిద్ర లెగుస్తుందో చూడాలి.