అమరావతికి రుణం ఇచ్చే విషయంలో వైసీపీ పెడుతున్న కొర్రీలు అన్నీ ఇన్నీ కావు. వరుస పెట్టి ప్రపంచ బ్యాంక్ కు రుణం ఇవ్వద్దు అంటూ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై పలు మార్లు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడటం, మరోసారి ఎవరో ఒకరు లేఖలు రాయటం, మళ్ళీ వాళ్ళు రావటం, నిబంధనలు అడ్డుగా పెట్టి వైసీపీ ఇలా రెచ్చిపోతుంది. దీంతో, ప్రపంచ బ్యాంక్ బృందం మరోసారి ఇక్కడికి రాబోతోంది. అమరావతిలోని కొన్ని ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులకు సుమారు రూ.7,000 కోట్ల రుణ సహాయం అందజేయాలన్న ఏపీసీఆర్డీయే అభ్యర్థన దరిమిలా ఇప్పటికే పలుసార్లు ఈ బ్యాంక్ ప్రతినిధులు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే 4 రోజులపాటు అమరావతిలో గడపనున్న ప్రపంచ బ్యాంక్ బృంద సభ్యులు ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులతో చర్చలు జరపడంతోపాటు క్షేత్ర పరిశీలన కూడా చేయనున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠాతోనూ వారు భేటీ అయ్యే అవకాశముంది.
కాగా.. తాజా బృందంలో సుమారు 20 మంది సభ్యులు ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడికి వచ్చిన బృందాల్లో సభ్యుల సంఖ్య ఇంచుమించుగా 10కి అటూఇటూగా ఉండేది. ఈసారి వీరి సంఖ్య అధికం కావడానికి తాము రుణం అందజేయాలని భావిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ మరింత కూలంకషంగా పరిశీలించాలని ప్రపంచ బ్యాంక్ భావిస్తుండడమే కారణమని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ బృంద సభ్యులు సీఆర్డీయే రుణం కోరిన ప్రాజెక్టుల వల్ల ప్రభావితులవబోయే వివిధ వర్గాలకు కల్పిస్తున్న పునరావాస, సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనా మార్గాలతోపాటు ఆయా ప్రాజెక్టుల పరిసరాల్లోని పర్యావరణంపై అవి చూపబోయే ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తారని తెలిసింది.
ఇదిలా ఉండగా.. ప్రపంచ బ్యాంక్ బృందాలు ఇప్పటికే పలు పర్యాయాలు అమరావతిలో పర్యటించడం, ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు సైతం అమెరికాలోని ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, దాని ఉన్నతాధికారులతో చర్చలు జరపడం వంటివి జరిగినప్పటికీ రాజధాని ప్రాజెక్టులపై అది రుణమిచ్చే విషయంపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకటన రాలేదు. తాము అడిగిన రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సూత్రప్రాయంగా అంగీకరించిందని, నేడో రేపో సదరు మొత్తం అందడం ఖాయమని సీఆర్డీయే అధికారులు చెప్పడమే తప్ప అటువైపు నుంచి మాత్రం ఆ దిశగా నిర్దిష్ట ప్రకటనేమీ వెలువడడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి ఇంకొకసారి అమరావతి సందర్శనకు రాబోతున్న ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన పూర్తయిన తర్వాతైనా ఈ రుణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందో లేక ఎడతెరిపి అన్నదే లేనట్లుగా సాగుతున్న సుదీర్ఘ పరిశీలనా ప్రక్రియ మరి కొంతకాలం కొనసాగుతుందో అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.