లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో ఓ పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి కావడానికి రాష్ట్ర బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప బీజేపీ కేంద్ర నాయకులకు దాదాపు రూ.1800 కోట్లు ముడుపులుగా చెల్లించారని ‘కారవాన్’ పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఒక్క బీజేపీ సెంట్రల్ కమిటీ సభ్యులకే దాదాపు 1000 కోట్లు ఇచ్చారనీ, వీటికి తోడు ప్రస్తుత మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలకు రూ.150 కోట్లు, రాజ్‌నాథ్‌సింగ్‌కు రూ. 100 కోట్ల చొప్పున చెల్లింపులు జరిగాయనీ, ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు చెరి 50 కోట్ల చెప్పున చెల్లించారనీ. వీరే కాక పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులకు రూ.150 కోట్లు ముడుపులు చెల్లించారనీ ఆ పత్రిక పేర్కొంది. ‘దాదాపు రూ.250 కోట్లను జడ్జీలకు, లాయర్లకు ఇచ్చారు’’ అని కారవాన్ రాసింది గానీ వారి పేర్లు వెల్లడించలేదు. నితిన్ గడ్కరీ కుమారుడి పెళ్లికి రూ.10 కోట్లు ఇచ్చినట్లు కూడా వెల్లడించింది.
ఈ ముడుపులకు సాక్ష్యంగా- ఎవరికెంత ఇచ్చినదీ ఓ డైరీలో రాశారని అంటూ పేజీలను ప్రచురించింది. అక్రమ మైనింగ్ ద్వారా వందల కోట్లు ఆర్జించిన బళ్లారి బ్రదర్స్- గాలి జనార్దనరెడ్డి అండ్ కో ఈ డబ్బు సమకూర్చారనీ ‘కారవాన్’ ఆ కథనంలో వెల్లడించింది. ‘సీఎంను అయ్యేందుకు యడ్యూరప్ప అనే నేను నేతలకు డబ్బులిచ్చాను’ అని ఉందని కారవాన్ కథనం. విశేషమేమంటే ఈ డైరీని కాంగ్రెస్ నేత, ప్రస్తుత మంత్రి డీకే శివకుమార్ ఇంటి నుంచి 2017లో జరిపిన దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి అది ఐటీ, సీబీడీటీ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఐటీ, సీబీడీటీలు రెండూ శుక్రవారం విడివిడిగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. యడ్యూరప్ప ఇంటినుంచి చోరీ అయిన ఆ డైరీ అటుతిరిగి-ఇటు తిరిగి కాంగ్రెస్ నేతల చేతికి, అది కూడా డీకే చేతికి చేరిందన్నది కారవాన్ కథనం. ఆయన ఒరిజినల్ ఎక్కడో దాచిపెట్టి- బీజేపీ అగ్రనేతలకు చెల్లింపులు జరిపిన వివరాలున్న జిరాక్స్ కాపీలను తన అల్మారాలో పెట్టారనీ, అవే ఐటీ దాడుల్లో దొరికాయన్నది మరో కథనం.
ఈ డైరీ వివరాలు బయటకు పొక్కడంతో కాంగ్రెస్ వెంటనే దాడి ప్రారంభించింది. బీజేపీ నేతలంతా అవినీతిపరులేనని రాహుల్‌గాంధీ ట్విటర్‌లో తీవ్రంగా విమర్శించారు. ‘నోమో (మోదీ), షా, రాజ్‌నాథ్... బీజేపీ చౌకీదారులంతా చోరులే’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమార్కులతో కలిసి రాష్ట్రాన్ని లూటీ చేసి బీజేపీ అధిష్ఠానం పెద్దలకు వందల కోట్లు ముడుపులు చెల్లించారని సీఎం కుమారస్వామి ఆరోపించారు. దీనిపై లోక్‌పాల్‌తో విచారణ జరపాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. డైరీలోని మరో పేజీలో... ‘నన్ను సీఎంను చేయడంలో గాలి జనార్దన్‌రెడ్డి కీలక వ్యక్తి’ అని రాసుకుని యెడ్డీ సంతకం చేసినట్లు కనిపిస్తోంది. ఆ కింద ఎవరెవరికి ఎంత ఇచ్చారో ప్రస్తావించారు. నరేంద్ర స్వామికి రూ.20కోట్లు, జి.శేఖర్‌కు రూ.10కోట్లు, జే బాలచంద్రా, డి.సుధాకర్, శివనగౌడ, వేంకటరమణప్ప, నారాయణ స్వామి, ఆనంద్‌కు రూ.20 కోట్ల చొప్పున ఇచ్చినట్లు ఉంది. డైరీలోని మరో పేజీలో విరాళాల రూపంలో రూ.2,690 కోట్లు యడ్యూరప్ప తీసుకున్నట్లు ఉంది.