దేశవ్యాప్తంగా ఏపీ పని అయిపోయిందన్న అభిప్రాయం వచ్చేసిందని, ఆరాష్ట్రం అభివృద్ధిలో, ఎకానమీలో ముందుకెళ్లే పరిస్థితిలేదనుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే డెమోక్రసీలో ఉన్నామా...లేక జగనోకసి, అంటే జగన్ కసిలో ఉన్నామా అనే సందేహం రాష్ట్రప్రజలందరిలో ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమెల్సీ అశోక్‌బాబులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవాసులపై కసి తీర్చుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అధికారంలోకి రావడానికి ఒక్కఛాన్సంటూ బతిమాలి, వరమిచ్చిన ప్రజలపై, రాష్ట్రంపై తన భస్మాసుర హస్తాన్ని పెట్టాలని చూస్తున్నాడని, ఆయన బారినుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలన్నారు. మండలి రద్దు, పునరు ద్ధరణ అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండవన్న యనమల, అసెంబ్లీలో ఆర్టికల్-169 కింద తీర్మానం చేసినంత మాత్రాన ఏమీ జరగదన్నారు.
అసెంబ్లీ పంపిన తీర్మానంపై కేంద్రం బిల్లుని తయారుచేసి లోక్‌సభకు పంపుతుందని, తరువాత అది రాజ్యసభకు, రాష్ట్రపతి ముందుకు వెళుతుందన్నారు. ఆర్టికల్ 174-2 (బీ) కింద అసెంబ్లీని రద్దుచేసే అధికారం గవర్నర్‌కు ఉందని, ప్రజల ఆలోచనలకు వ్యతిరేంగా వెళుతోన్న ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అధికారం ఆయనకు ఉందన్నారు. ప్రభుత్వం మండలిని రద్దుచేస్తే, గవర్నర్ అసెంబ్లీని రద్దుచేయడంద్వారా ఎన్నికలకు వెళితే ప్రజలు ఎవరిపక్షమో తేలుతుం దని యనమల స్పష్టంచేశారు. కేంద్రప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించే అధికారం రాష్ట్రాలకు ఉండబోదని, పీపీఏల విషయంలో ఏకపక్షంగా ముందుకెళ్లిన ప్రభుత్వా నికి ఎలాంటిపరిస్థితి ఎదురైందో అందరికీ తెలుసునన్నారు. ఆర్టికల్-257ప్రకారం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని, కేంద్రం ఆదేశాలను ధిక్కరిస్తే, ఆర్టికల్-356కింద చర్యలు తీసుకునే అధికారం కూడా వారికి ఉందన్నారు. బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపేవిషయంలో, తనకున్న విచక్షణాధికారంతో ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నాడని, ఆయన అధికారాలను ప్రశ్నించేహక్కు ఎవరికీ ఉండదని, ఛైర్మన్ న్యాయబద్ధంగానే నిర్ణయం తీసుకున్నాడని యనమల తెలిపారు.
బాధ్యతలేని జర్నలిజం చేస్తున్న సాక్షి...ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేయడం, కౌన్సిల్ తిరస్కరించడం, శాఖల తరలింపుని హైకోర్టు తప్పపట్టడం జరిగినా కూడా సాక్షి మీడియాలో ఇంకా తప్పుడువాదనలు చేస్తూనే ఉన్నారని మాజీమంత్రి మండిపడ్డారు. బిల్లుని సెలెక్ట్‌కమిటీకి పంపలేదని రాయడం, బాధ్యతలేని జర్నలిజం చేస్తున్న జగన్ సొంతమీడియాకే చెల్లిందన్నారు. బుర్రలేనిమంత్రులంతా అసెంబ్లీలో గంటలో ఆమోదించిన బిల్లుని మండలి గుడ్డిగా ఆమోదించాలా అని రామకృష్ణుడు ప్రశ్నించారు. సెలెక్ట్‌కమిటీలో 9 నుంచి 15మంది సభ్యులుంటారని, వారంతా ప్రజాభిప్రాయాలు తీసుకుంటారని, అందుకు అవసరమైన కాలవ్యవధిని మండలే నిర్ణయిస్తుందని యనమల పేర్కొన్నారు.
ప్రజాభిప్రాయం కోరడం తప్పా...? అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని రిజెక్ట్‌చేశారంటున్న మంత్రులంతా మిడిమిడిజ్ఞానంతో మాట్లాడుతున్నారని, మండలి బిల్లుని ప్రజాభిప్రాయం కోరమని చెప్పింది తప్ప ఎక్కడా దాన్ని తిరస్కరించలేదని యనమల స్పష్టంచేశారు. ఎస్సీకమిషన్, ఇంగ్లీషు మీడియం బిల్లుల విషయంలో కూడా ఇలానే తప్పుడు ప్రచారంచేశారన్నారు. వాటిని ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, ఎస్సీ కమిషన్ బిల్లులో బీసీకమిషన్ బిల్ మాదిరే కేటగిరీలు చేయాలని సూచించామని, ఇంగ్లీషు మీడియం బిల్లులో తెలుగు బోధనను ఎంపికచేసుకనే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వాలని సూచించామన్నారు. ఆ రెండుబిల్లులను ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, వాటిని తిప్పిపంపా క తిరిగి పెద్దలసభకు పంపేముందు మనీబిల్లులుగా మార్చారన్నారు. 3రాజధానుల బిల్లు మనీబిల్లా..ఆర్డినరీ బిల్లా అని హైకోర్టుకూడా ప్రశ్నించిందన్నారు.
దేశరాజధాని ఏదంటే ఢిల్లీ అని చిన్నపిల్లాడు కూడా చెప్తాడని, రాజ్యాంగంలో కేపిటల్ అనేపదం లేకుంటే, ఆర్టికల్ 239 (ఏ) ప్రకారం నేషనల్ కేపిటల్ టెరిటరీ అనేపదం ఎక్కడినుంచి వచ్చిందన్నారు. రాజ్యాంగం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న వ్యక్తికి దాని గురించి ఏంతెలుసునన్నారు. మామూలు చదువే చదవని వ్యక్తికి, రాజ్యాం గం చదివేంతజ్ఞానం ఎక్కడనుంచి వస్తుందని యనమల ఎద్దేవాచేశారు. తప్పులు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తే మంచిదన్నారు. టీడీపీ హాయాంలో తరచూ దావోస్‌పర్యటనకు వెళ్లి, పెట్టుబడులు రాబట్టామని, ఈప్రభుత్వం వచ్చాక అలాంటివేమీ లేవన్నారు. రేపో, ఎల్లుండో న్యాయస్థానంలో జగన్‌కేసులపై వాదనలు ప్రారంభమ వుతాయని, ఏ1, ఏ2, ఏ3లంతా ఒకరితర్వాత ఒకరు కోర్టుబోనులో నిల్చోవడం ఖాయమని యనమల తేల్చిచెప్పారు. ఫెమా, మనీలాండరింగ్ మోసాలకు గాను జగన్‌కు శిక్షపడటం ఖాయమని, ప్రజాధ నాన్ని దోచుకొని, 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తిని ఇన్‌కెమరాద్వారా విచారించడం సరికాదన్నారు. అత్యాచారకేసుల విచారణలో మాత్రమే ఇన్‌కెమెరా విధానాన్ని అవలం భిస్తారని, జగన్ కేసులవిచారణలో బహిరంగవిచారణే జరపాలని, న్యాయస్థానాలు ఈదిశగా పునరాలోచించాలని యనమల విజ్ఞప్తిచేశారు. హిట్లర్, ముస్సోలినీల మాదిరి గా తాను అనుకున్నదే జరగాలన్న ఉక్రోషం జగన్‌లో కనిపిస్తోందన్నారు.