తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను రాజకీయంగా చూడటం గర్హనీయమని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు అన్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ విజయసాయి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు రాసింది..మొదటి లేఖ కాదని.. ఈ విషయం విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని గతంలోనే చంద్రబాబు జగన్‌కు లేఖ రాశారని యనమల గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినా.. వైసీపీ నేతలు అబద్ధాలు మానడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విలాసవంతమైన భవనాలు ఊరికొకటి చొప్పున.. ఎవరికి ఉన్నాయో అందరికీ తెలిసిందేనని యనమల అన్నారు.
కృష్ణా నది కరకట్టపై తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని టీడీపీకి కేటాయించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు నుంచి జగన్‌కు లేఖ వెళ్లినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. " సీఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా..? పోతుందా..? అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?" అని విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.