వైఎస్ హయాంలో ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకున్న అధికారులందరూ జగన్ తో పాటు జైలు, కోర్టుల పాలయ్యారని టీడీపీ శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆత్మకూరులోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల జోలికి పోలేదు. కేసులున్నప్పటికీ ముఖ్యమైన పోస్టింగ్ లు ఇచ్చి బ్యూరోక్రసీని గౌరవించాం. ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల ఒక సెక్షన్ అధికారులు ఇబ్బందులు పడతారు. ఒక సెక్షన్ అధికారులను ఒక రాజకీయ పార్టీకి అంటగట్టి కక్ష సాధించడం సరైన విధానం కాదు. రేపు ప్రభుత్వాలు మారితే మరో సెక్షన్ పై కక్షపూరిత విధానాలు చేయడం కూడా సరికాదు. రాజకీయాలకు అతీతంగా బ్యూరోక్రసీ ఉండాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు అనుగుణంగా అధికారులు నడుచుకోవాలి. ఇలాంటి విధానాలను ప్రతి ఒక్కరు ఖండించాలి. అధికారులు కూడా ముందుకు రావాలి. రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకున్నా.. అధికారులను ఎందుకు ఇరికించాలి? టీడీపీపై, ప్రజలపై, అధికారులపై జగన్ కక్ష తీర్చుకుంటూనే ఉన్నారు. ఇలాగే వ్యవహరిస్తే ఇది ఇంతటితో ఆగదు. అధికారులు నిస్వార్థంతో పనిచేయలేరు. అధికారులపై కక్షపూరిత విధానాలు మంచిది కాదు. జగన్ పునపరిశీలించాలి. సస్పెన్షన్లు, వేధింపులకు పాల్పడటం మానుకోవాలి.

మరోవైపు కౌన్సిల్ లో జరిగిన పరిణామాలకు అందరూ సాక్షులేనని యనమల వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ నిరంకుశ పాలనలో ఏ వ్యవస్థను కూడా స్వచ్ఛందంగా నడపనీయడం లేదు. శాసనసభ ద్వారా వచ్చిన బిల్లులను శాసన మండలి చెక్ చేసుకోవచ్చు. ఆదరాబాదరాగా బిల్లులు వచ్చినప్పుడు పార్లమెంట్ లో రాజ్యసభకు ఉన్న అధికారాలు.. మండలికి ఉన్నాయి. మూడు రాజధానుల అంశం, సీఆర్డీయే రద్దు బిల్లు నేపథ్యంలో వచ్చిన ఆందోళనలు ఇక్కడ మనం గమనించాలి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లులను శాసనసభలో బుల్డోజ్ చేసి, మండలిలో కూడా బుల్డోజ్ చేద్దామనుకున్నారు. ఇక్కడ అది చెల్లలేదు. చెక్ పెట్టాం. ఆయా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. దీనివల్ల అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలను తీసుకోవచ్చు. మూడు, నాలుగు నెలల సమయం ఉంటుంది. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి మండలిలో బిల్లు రూపంలో వస్తుంది.

ఆ బిల్లులను మళ్లీ చర్చించవచ్చు. ఈ తంతు వల్ల కొంత ఆలస్యమైనా.. మేం బిల్లులను అడ్డుకోలేదు. సెలెక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలని మండలి ఛైర్మన్ సెక్రటరీని ఆదేశిస్తే.. ఆయా పేర్లు తీసుకోవడానికి కూడా సెక్రటరీ వెనుకాడుతున్నారు. ప్రభుత్వం అతనిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తోంది. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనమండలి వ్యవహారాల్లో ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది? ఛైర్మన్ అధికారాలను ఎవరూ ప్రశ్నించలేరు. కౌన్సిల్ లో నిబంధనల ప్రకారం అంతా జరిగితే ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి? కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. ఛైర్మన్ ఆదేశాల ప్రకారం సెలెక్ట్ కమిటీకి టీడీపీ, పీడీఎఫ్, బీజేపీ పేర్లు ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం సెక్రటరీపై ఒత్తిడి తీసుకువచ్చి పేర్లను నిలుపుదల చేస్తోంది. సెక్రటరీపై ప్రభుత్వానికి అధికారం లేదు. ప్రతిపక్షాలను కూడా కలుపుకుని దీనిపై మేం ఆలోచన చేస్తున్నాం. మరోవైపు ఛైర్మన్ పై ప్రివిలేజ్ మూవ్ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు. ఇవన్నీ కంటెమ్ట్ ఆఫ్ హౌస్ కిందకు వస్తుంది.

మంత్రులు, సెక్రటరీపై కూడా కంటెమ్ట్ ఆఫ్ హౌస్ కింద నోటీసులు ఇవ్వొచ్చు. సభ్యులకు ఆ అధికారం ఉంటుంది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో మండలి కార్యదర్శి త్వరతగతిన నిర్ణయం తీసుకుని ఆర్డర్ ఇవ్వాలని మేం కోరతాం. మరోవైపు ఈ విధంగానే సెక్రటరీ వ్యవహరిస్తే.. కంటెమ్ట్ ఆఫ్ హౌస్ కింద ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం. కౌన్సిల్ లో మాకు పూర్తి మెజారిటీ ఉంది. ఛైర్మన్ ను నిందించారు కాబట్టి సుమోటోగా రిఫర్ చేసే అధికారం ఛైర్మన్ కు ఉంది. హౌస్ సైనడైన్ అయిన తర్వాత ఇంత హడావుడిగా ప్రోరోగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రోరోగ్ చేసినా బడ్జెట్ సమావేశాలకు పిలవాల్సిందేగా? హౌస్ ప్రోరోగ్ అయినా బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు చేయలేరు. ఇవన్నీ వైసీపీ నేతలకు తెలియదేమో. బిల్లులు ల్యాప్స్ కావు. కౌన్సిల్ కు సంబంధించి సెలెక్ట్ కమిటీ ముందు ఉండే బిల్లులు సెలెక్ట్ కమిటీ ముందే ఉంటాయి. పెండింగ్ బిల్లులు ఉంటే అవికూడా ఉంటాయి. ప్రోరోగ్ అయినా సెలెక్ట్ కమిటీ పని సెలెక్ట్ కమిటీదే. అసెంబ్లీ డిసాల్వ్ అయితే అప్పుడు బిల్లులు ల్యాప్స్ అవుతాయి. వైసీపీకి వ్యవస్థల గురించి, సాంకేతిక అంశాల గురించి తెలియదు. మొండితనంతో ముందుకు వెళ్తున్నారు. అవసరమైతే మేం గవర్నర్ ను కూడా కలుస్తాం. మేం నిబంధనలకు అనుగుణంగా, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read