రాష్ట్రంలో ఎక్కడా ఫాక్షన్ లేదు. ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, చదువుల్లో, ఉద్యోగాల్లో చేరటంతో, బాంబుల సంస్కృతి చాలా వరకు కనుమరుగైంది. అడపాదడపా ఎక్కడైనా ఒకటి రెండు బాంబులు పట్టుబడటం మినహా చెప్పుకోదగిన సంఘటనలు ఏమి లేవని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. అలాంటిది రెంటచింతల మండలం మంచికల్లులో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు 15 నాటుబాంబులు లభ్యం కావడంపై ఆ ప్రాంతంలోనే కాదు.. జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. బాంబులు పట్టుబడింది గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగృహం సమీపంలోనే. పోలీసు జాగిలాలు అక్కడికి వెళ్లి ఆగిపోయాయి. దీన్నిబట్టి ఎమ్మెల్యే యరపతినేనిని ఎవరైనా లక్ష్యంగా చేసుకున్నారా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో బాంబులు బయటపడటం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని పల్నాడు వాసులు కోరుతున్నారు.
ఈ నెల 22వ తేదీ శనివారం కోర్ల పౌర్ణమిని పురస్కరించుకుని మంచికల్లులో తిరునాళ్ల, సిడిమాను ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇదే గ్రామానికి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని పలు కూడళ్లలో గురువారం రాత్రి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు నుంచి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు మాచర్ల, గురజాల సీఐలు సాంబశివరావు, నరసింహారావు, మాచర్ల రూరల్, కారంపూడి ఎస్‌ఐలు లోకేష్, ఎం మురళి రంగ ప్రవేశం చేసి గ్రామాన్ని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో వేకువ జామున గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంటి ఎదుట యరపతినేని నరసింహారావుకు చెందిన కారు కింద బక్కెట్‌లో 15 నాటుబాంబులను కనుగొన్నారు. అనుమానంతో నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆ బాంబులను ఎవరు తెచ్చారు..? ఎక్కడ తయారు చేయించి తీసుకువచ్చారనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఎమ్మెల్యే వస్తారని తెలిసి కవ్వించి గొడవలు పెట్టుకొనేందుకు ముందుగానే రంగం సిద్ధం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15 నాటు బాంబులు ఒకే చోట ఉంచారంటే పథకం భారీ స్థాయిలోనే ఉంటుందని స్థానికులు అంటున్నారు. 40 మంది పోలీసులు మంచికల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా యరపతినేని నరసింహారావు ఇంటి ముందు ఆగిన ఉన్న వాహనం కింద అడుగు భాగాన బాంబులతో కూడిన బక్కెట్ లభ్యమైంది. పదేళ్ల క్రితం మంచికల్లు-పాలువాయి గేటు మార్గమధ్యంలో బాంబులు దొరికాయి. మరోసారి ఇవి పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తుంది. నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామంలో నలుగురు కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు కేటాయించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వైసీపీ నాయకుడు నరసింహారావును విడుదల చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు గురజాలలో ధర్నా చేశారు.