గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి, వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి, తన సమీప తెలుగుదేశం అభ్యర్ధి వల్లభనేని వంశీ పై, యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే, పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చింది. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై, వెంకట్రావ్ అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ, రెండు నెలల క్రిందట వంశీ మీడియాకు ఎక్కారు. గత ఎన్నికలకు ముందు ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో, ఎంఆరోవో సంతకం ఫోర్జరీ చేసారని, వంశీ ఎన్నిక రద్దు చెయ్యాలి అంటూ, కోర్ట్ లో కేసు వేసిన వెంకట్రావ్, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే అప్పటి వరకు, తనని జగన్ ప్రభుత్వం వేధిస్తుంది అంటూ వచ్చిన వంశీ, తమ అధినేత చంద్రబాబుకు వాట్స్ అప్ మెసేజ్ పంపించి, తమ అనుచరుల పై వేధింపులు తట్టుకోలేక పోతున్నాని, రాజకీయ సన్యాసం తీసుకుంటాని చెప్పారు. అయితే, అనూహ్యంగా, చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తున్న రోజు, ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు పై తిట్ల దండకం అందుకున్నారు.
రెండు మూడు రోజులు ఇలాగే కొనసాగటంతో, తెలుగుదేశం పార్టీ వంశీకి షోకాజ్ నోటీస్ ఇచ్చి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి వంశీ దూరం అయ్యి, జగన్ మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానాని చెప్పన సందర్భంలో, అప్పటి వరకు గన్నవరంలో వైసీపీ తరుపున బలంగా నిలబడ్డ వెంకట్రావ్ పరిస్థతి కన్ఫ్యూషన్ లో పడింది. వంశీ రాజీనామా చేస్తే, తనకు మళ్ళీ వైసీపీ టికెట్ వస్తుందా లేదా అనే ఆలోచనలో పడ్డారు. వంశీ రాకను, వెంకట్రావ్ అనుచరులు, పెద్ద ఎత్తున అడ్డుకుని, నిరసన తెలిపారు. అయితే, వెంకట్రావ్, జగన్ ని కలవటంతో, జగన్ ఇచ్చిన అభయం మేరకు, వెంకట్రావ్ ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. వంశీ పార్టీలో చేరిన, రోజున చూద్దామని అన్నారు.
అయితే, ఆ రోజు జగన్ తో జరిగిన రాజీలో భాగంగా, ఈ రోజు వెంకట్రావ్ కు, ఒక పదవి కట్టబెట్టారు జగన్. కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావుని నియమించారు. అయితే, ఇంత చిన్న పదవి తీసుకోవటానికి, యార్లగడ్డ వెంకట్రావు ఒప్పుకున్నారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ వెంకట్రావ్ ఒప్పుకుంటే, గన్నవరం వివాదం ముగిసిపోయినట్టే. ఒక వేళ ఒప్పుకోక పొతే మాత్రం, మళ్ళీ ఇబ్బందులు తప్పవు. ఈ పదవితో పాటుగా, ఎమ్మేల్సీ లాంటి పదవి కూడా ఏమైనా ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరో పక్క డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సందర్భంలో, వంశీ ఎటు వైపు కూర్చుంటారు ? అధికార పక్షం వైపా ? లేక తటస్థంగా ఉంటారా అనేది కూడా చూడాల్సి ఉంది.