అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా, స్పీకర్ ప్రశంసా తీర్మానంలో చంద్రబాబుని ఇరికిద్దాం అనే వ్యూహం బెడిసికొట్టింది. స్పీకర్ పై ప్రశంసలు పక్కన పెట్టి, చంద్రబాబుతో గేమ్ ఆడదామని, వైసిపీ నేతలు, తాము తీసిన గోతిలో తామే పడిన పరిస్థితి అయ్యింది. అసలు విషయంలోకి వస్తే, స్పీకర్ ఎన్నిక గురించి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. రాజశేఖర్ రెడ్డి లాంటి బద్ధ శత్రువు కూడా, అవి తప్పకుండా, చంద్రబాబుకి ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే వాళ్ళు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగాయి. స్పీకర్ ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అధికార పక్షం నుంచి ఏ సమాచారం రాలేదు. స్పీకర్ పదవికి అధికార పక్షం నుంచి తమ్మినేని సీతారాం బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అప్పడు టీడీపీ సభ్యులెవరూ వెంటలేరు. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షం నుంచి స్పీకర్ ఎన్నికపై సమాచారం ఇచ్చేవారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
స్పీకర్ నామినేషన్ పత్రాలపై ప్రతిపక్ష సభ్యులు కూడా సంతకాలు చేస్తారని, ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పిలిస్తే హాజరవుతారని కూడా ఒక సీనియర్ ఎమ్మెల్యే గుర్తుచేశారు. కానీ తమకు ఏ సమాచారం రాకపోవడం ఆశ్చర్యపరచిందన్నారు. ప్రధాన ప్రతిపక్షం మద్దతు తీసుకోవాలన్నది రూలు కాదని, అదొక సంప్రదాయం మాత్రమేనని వ్యాఖ్యానించారు. అయితే సభలో కూడా ఇదే ఒరవడి కొనసాగింది. స్పీకర్ గెలిచారని, సియం సహా మిగతా పార్టీలు వారు వచ్చి తమ్మినేనిని స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టాలి అని కోరారు. సియం గురించి ప్రస్తావన చేసినప్పుడు, ప్రతిపక్ష నేత గురించి కూడా ప్రస్తావన చెయ్యాలి. అది చెయ్యలేదు. దీంతో చంద్రబాబు, డిప్యూటీ లీడర్ అయిన అచ్చం నాయుడుని పంపించారు. అయితే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసిన వైసిపీ, ఈ విషయంలో చంద్రబాబుది తప్పు, బీసిని అవమానించారు అంటూ మొదలు పెట్టింది. స్పీకర్ పై ప్రశంసలు కాస్త, చంద్రబాబు పై విషం చిమ్మటం కోసం వాడారు. అయితే ఇలాంటి పిల్ల వేషాలు, తన 40 ఏళ్ళ అనుభవంలో ఎన్నో చూసారు. అందుకే వెంటనే కౌంటర్ స్ట్రాటజీ మొదలు పెట్టి, సభలోనే వైసిపీని అభాసుపాలు చేసారు. 151 మంది ఉన్నా, 23 మంది ఉన్న పవర్ ఏంటో చూపించారు.
వాళ్ళ విష ప్రచారం తిప్పి కొడుతూ, అధికారపక్షం సభా సంప్రదాయం పాటించలేదని, ఇక్కడ జరిగే విషయం ప్రజలకు తెలియాలని చంద్రబాబు నాయుడు అన్నారు. రెండో రోజు గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ స్పీకర్గా తమ్మినేని సీతారాం పేరు చెప్పినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని భావించామని అన్నారు. అలాగే మమ్మల్ని కూడా అడుగుతారని, తాము కూడా పూర్తిగా సహకరించాలనే ఉద్దేశంతో ఉన్నామని.. అయితే అలా జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుమునుపు తాను సీఎంగా సభానాయకుడుగా ఉన్నప్పుడు స్పీకర్ను ఎంపిక చేసిన తర్వాత.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వద్దకు పంపించి ఆయన సంతకం తీసుకుని ఆరోజు నామినేషన్ చేయించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్ ఎంపికపై కనీసం తమకు ఎవరైనా చెబుతారని చూశామని, ఎవరూ చెప్పలేదని చంద్రబాబు అన్నారు. గురువారం ఉదయం కూడా సభకు వచ్చినప్పుడు కనీసం ఒక మాట కూడా చెప్పలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా సభా గౌరవాన్ని పాటించలేదని, ఇష్టమైతే రండి, లేకపోతే లేదు అన్న విధంగా ప్రవర్తించారని, ప్రజలు ఏమనుకుంటారోన్న విషయం కూడా ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ఈ విషయం సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెబుతున్నానన్నారు. తామెప్పుడూ ఏక పక్షంగా చేయలేదని అన్నారు. కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, వాటిని వైసీపీ పాటించలేదని, అయినా సభకు పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి చంద్రబాబుని ఎదో చేద్దామని, అనుకుంటే, ఆయన ఇచ్చిన కౌంటర్ లకు, వైసిపీ నేతలకు దిమ్మ తిరిగింది.