విజయవాడ నగరంలో ఉద్యోగుల సభలో వైసీపీకి చుక్కెదురైంది. వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. వైసీపీ అసెంబ్లీకి వెళ్లి పోరాడాలంటూ ఉపాధ్యాయుల నినాదాలు చేశారు. అంతేకాకుండా ఈ సభలో వైసీపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరుపార్టీల నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామంటున్న వైసీపీ అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోకుండా అధికారంలోకి వస్తే చేస్తామనడం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు.
రఘువీరా వ్యాఖ్యలపై వైసీపీ నేత పార్థసారథి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వంపై పోరాటం దున్నపోతుపై వర్షపడటంతో సమానమని విమర్శించారు. అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆయన జవాబిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై పోరాడాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. దీనిపై రాజకీయం చేయవద్దని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగులు ఎంత చెప్పినా వైసిపీ నేతలు వెనక్కు తగ్గలేదు. వాళ్ళు తిడుతున్నా, అక్కడే ఉన్నారు.
ఈ రోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడలో ఆందోళనకు దిగారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ తీశారు. 13 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు జింఖానా గ్రౌండ్‌లో ధర్నా నిర్వహించారు. తమ పెన్షన్ డబ్బుకు రక్షణ లేకుండా పోతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలంటో ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు.