వైసీపీలో ఎక్కువ సీట్లు నేరచరితులకే ఇచ్చారంటూ ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నారు. వారి నామినేషన్ పత్రాలను పరిశీలిస్తే అవి ఆరోపణలు కాదని తెలుస్తుంది. అధినేత వైఎస్ జగన్ తనపై 31కేసులున్నాయని తన నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. నేరస్తులకు మనం పిల్లనే ఇవ్వమని, అలాంటిది సీఎం పదవి ఎందుకు కట్టబెడతామని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసులున్న అభ్యర్థులు కేవలం వైసీపీలోనే కాదు అనేక పార్టీల్లో ఉన్నారన్నది వారి నామినేషన్ అఫిడవిట్లే చెబుతున్నాయి. అయితే ఓ వైసీపీ అభ్యర్థి అయితే అధినేత జగన్‌నే మించిపోయి కేసుల విషయంలో అగ్రస్థానంలో నిలిచారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 32 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఆయనపై 1985 నుంచి 2019 వరకు ఈ కేసులు నమోదయ్యాయి. 1987లో ఆయనపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. హత్యలు, దాడులు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, తుపాకులు, బాంబులతో దాడులు చేయడం, ఆస్తులను నష్టపరచడం వంటి నేరాల కింద ఆయనపై కేసులున్నాయి. అత్యధికంగా యల్లనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో కొన్ని కేసులను న్యాయస్థానాలు కొట్టివేసినట్లు నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇక ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవలే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన ఆమంచిని లక్ష్యం చేసుకొని బాబు విమర్శలు ఎక్కుబెట్టారు. వైసీపీలో 95 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 12 మంది ఎంపీ అభ్యర్థులకు నేరచరిత్ర ఉందని బాబు తెలిపారు. ఆ పార్టీ అధినేత జగన్‌పై 31 కేసులుంటే.. ఇక్కడి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై 29 కేసులు ఉన్నాయి. ఈయన జగన్ మోహన్ రెడ్డితో పోటీ పడుతున్నారని బాబు ఎద్దేవా చేశారు. ఆమంచి తమ్ముడు స్వాములుపై ఉన్న 14 కేసులు, బంధువులపై ఉన్న 30 కేసులను కలుపుకుంటే మొత్తం 70కిపైగా కేసులున్నాయన్నారు.