ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి చెందిన, వైసీపీ ఎమ్మెల్యే తమ భూమిలో, ఇది తన భూమి అంటూ బోర్డులు పెట్టారని, వంద కోట్లు విలువ చేసే ఈ స్థలం మాది అంటూ, ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలోనే కొంత మంది ఫిర్యాదు చెయ్యటం సంచలనంగా మారింది. వంద కోట్లు విలువ చేసే ఈ స్థలం విషయం పై, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమి నాది అని వైసీపీ ఎమ్మేల్యే చెప్పటం, కాదు ఇది మేము ఎప్పుడో కొనుక్కున్నాం అంటూ అవతలి వారు చెప్తూ, స్థలం కాగితాలు చూపిస్తూ ఉండటంతో, ఇప్పుడు ఈ వివాదం పై తెలంగాణా పోలీసులు నిజం ఏమిటి అనే దాని పై విచారణ చేసే పనిలో ఉన్నారు. తాము 20 ఏళ్ళ క్రితమే ఈ భూమి కొన్నాం అని వారు చెప్తుంటే, వైసీపీ ఎమ్మేల్యే తాను 2008లో కొన్నాని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం పై ఆసక్తి కర చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ లోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట వద్ద 40 ఎకరాలు భూమి ఉంది.
ప్రస్తుతం, ఇక్కడ ఎకరం రెండు కోట్లు పైనే ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం, ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన భూమి అంటూ, బోర్డులు వెలిసాయి. అక్కడ ఇది వరకు 40 ఎకరాల భూమిలో వెంచర్ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. అయితే కొన్ని రోజుల క్రితం అక్కడ ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. అలాగే, లోపాలకి వెళ్ళే వీలు లేకుండా, కందకాలు తవ్వారు. దీంతో అక్కడ ఫ్లాట్లు కొన్న 828 మంది అవాక్కయ్యారు. ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్రెడ్డి దగ్గర, జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారని, ఆ ప్లాట్ ఓనర్లు చెప్తున్నారు. ఇవి కొన్న వాటిలో, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్తున్నారు.
అయితే తాము 20 ఏళ్ళ క్రితమే కొన్న ఫ్లాట్లలో, ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి, బోర్డును ఏర్పాటు చేసి, హద్దు రాళ్ళు తీసి వేసి, కందకాలు తవ్వారని, ఈ భూమిని ఆక్రమించే ఆలోచనలో వారు ఉన్నారని, తాము ఏమైపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకువెళ్ళి, కేసీఆర్ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసారు. అయితే దీని పై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే, ఈ భూమిలో తనకు కూడా వాటా ఉందని, 2008లో తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. నెల రోజులు నుంచి తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇది తన భూమి అని చెప్పారు. తన కంటే ముందే కనుక ఈ భూమిని అమ్మినట్టు ఆధారాలు చూపిస్తే, వారికే ఈ భూమి ఇచ్చేస్తాను అంటూ, వైసీపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మరి నిజంగానే ఇచ్చేస్తారా ? మీడియా ఒత్తిడితో ఇలా చెప్పారా ? అనేది చూడాలి.