ఒంటెద్దు పోకడలతో సీనియర్ నేతలను చులకను చేస్తూ, అందరినీ దూరం చేసుకుంటున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి మరో ఝలఖ్ ఇవ్వటానికి, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా రెడీ అయ్యారు... ప్రస్తుతానికి పార్టీ మారకపోయినా, జగన్ కు ఒక జర్క్ ఇవ్వటానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి, ప్రత్యేకంగా మాట్లాడి, సంచలనానికి తెర లేపారు... సంచలనం ఎందుకు అంటే, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, ఇప్పటి వరకు జగన్ కు నమ్మిన బంటుగా, చెప్పింది చేస్తూ, పార్టీ నిర్మాణనికి కృషి చేస్తూ వచ్చారు... అయితే, ఈ మధ్య జగన్ వైఖరి నచ్చక, అసంతృప్తిగా ఉంటున్నారు...
ఈ రోజు గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవం నిమిత్తం అక్కడికి వెళ్లిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కలుసుకున్నారు... ఈ సందర్భంగా ముస్తఫాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అంతకుముందు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన కారులో ముస్తఫా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు.
తాజాగా, రాయపాటి కారులో వెళ్లి చంద్రబాబును ముస్తఫా కలవడంతో వైసీపీని ఆయన వీడనున్నారనే వార్తలు బలపడుతున్నాయి. ఈ విషయమై ముస్తఫా స్పందిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలవడం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు ఇచ్చేందుకు ఆయన సుముఖత చూపారని అన్నారు. తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప, ఎట్టిపరిస్థితుల్లోనూ తన పార్టీని వీడనని, వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.