కొంతకాలంగా సీఎం చంద్రబాబు, టీడీపీ లక్ష్యంగా రెచ్చిపోతున్న వైసీపీ సోషల్ మీడియా తాజాగా చంద్రబాబుపై మరో అభ్యంతరకర పోస్టింగ్‌ను పెట్టింది. ఈ నెల 8న బెంగుళూరు వెళ్ళిన సీఎం చంద్రబాబు ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్య రాతలతో పోస్టు చేసింది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యుల ప్లకార్డులను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన సందేశాలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఈ నెల 10న టీడీపీ సోషల్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి కనకమేడల వీరాంజనేయులు గుంటూరులోని అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వైసీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి కుమార్‌రాజు నవీన్‌కుమార్‌రాజును మంగళవారం అరెస్టు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ నేతల చేతిలో ఉన్న ప్లకార్డుల్లోని అక్షరాలను మార్ఫింగ్ చేసి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా కొటేషన్లు రూపొందించి కొందరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దానిని కుమార్‌రాజు తనకు అందుబాటులో ఉన్న అనేక గ్రూపులకు ఫేస్‌బుక్ అకౌంట్లకు ఫార్వార్డ్ చేశాడు. ఈ మేరకు నమోదైన కేసులో అర్బన్ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో అదనపు ఎస్పీలు వై.టి.నాయుడు, లక్ష్మినారాయణ, వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో అరండల్‌పేట సీఐ వై.శ్రీనివాసరావు నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచారు.
ఈ కేసు విచారణలో ఉందని, ఆయా ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఎవరికైనా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి, అయితే వాటిని సక్రమ మార్గంలో వ్యక్తపరిచవలసిన అవసరం ఉంది. అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టు నిజాలను వక్రీకరించి రాస్తాం, మార్ఫింగ్ చేసి కించపరుస్తాం అంటే కుదరదు. ఇది అన్ని పార్టీల అభిమానులకూ వర్తిస్తుంది, అభిమానం హద్దు మీరకుండా చూసుకోండి. దురభిమానం ఇలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీయకుండా జాగ్రత్త వహించండి. ఒక్కసారి కేసు బుక్ అయితే, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీ మీద కేసు బుక్ అయితే, మహా అయితే బెయిల్ ఇచ్చి బయటకు తీసుకువస్తారు, ఆ కేసు మాత్రం, మీ కెరీర్ ని దెబ్బతీస్తుంది. అప్పుడు జగన్ రాడు, పవన్ రాడు, టిడిపి నాయకులు రారు. మన ఖర్మ మనమే అనుభవించాలి...