కోస్తాలో అత్యంత కీలకమైన పార్లమెంట్‌ నియోజకవర్గం అది. అక్కడ గెలిస్తే ఆంధ్రాను గెలుచుకున్నట్టేనని అందరూ భావిస్తారు. అందువల్ల ఆ సీటుపై వైసీపీ సీరియస్‌గా దృష్టి సారించింది. సరైన అభ్యర్ధి కోసం చివరి వరకూ అన్వేషించింది. ఆఖరి నిముషంలో ఆర్థిక దిగ్గజంలాంటి బిజినెస్ మ్యానే ఆ పార్టీకి అభ్యర్థిగా దొరికారు. ఆయనను నమ్ముకుంటే చాలు- వందల కోట్లు ఖర్చుపెడతారనీ, కీలకమైనా ఆ నియోజకవర్గంలో ఇక తమకు తిరుగులేదనీ వైసీపీ పెద్దలు అంచనా వేసుకున్నారు. ఆ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీచేసే అభ్యర్థులు కూడా ఇదే ఆశ పెట్టుకున్నారు. వైసీపీ పెద్దలకి కూడా ఆ పెద్దాయన నమ్మకం కలిగించారు. తాను పెట్టబోయే ఖర్చును వారి చెవిలో చెప్పి.. ఏపీ ఎన్నికల బరిలోకి దిగిపోయారు. నామినేషన్ దాఖలు రోజున నానా హంగామా చేశారు. ఆ తర్వాత మాత్రం రూట్‌ మార్చుకున్నారు. "ఇదిగో అదిగో..'' అంటూ డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేసుకుంటూ వచ్చారు. డబ్బు విషయంలో ఆయన వెనుకాడటంపై పార్టీ నేతలు తొలుత వేరుగా అర్థంచేసుకున్నారు. ఇప్పటినుంచే డబ్బులు పంచేస్తే ఓటర్లు ఆ సొమ్ముని ఖర్చుచేసేస్తారన్న ఉద్దేశంతోనే ఆయన అలా వ్యవహరిస్తున్నారని భావించారు. ఇది కూడా ఎన్నికల వ్యూహమే అనుకున్నారు.

అయితే వైసీపీ నేతలు ఆశలు మాత్రం అడియాసలుగానే మిగిలాయి. పోలింగ్ దగ్గరపడ్డ తరుణంలో కూడా ఆయన స్పందించలేదు. డబ్బుల కోసం అభ్యర్థులు ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ఒక్కొక్కరికీ కోటి, రెండు కోట్లు సర్ది.. ఆపై చేతులు దులిపేసుకున్నారట. ఆయన ఇచ్చిన ఈ సొమ్ములతో వైసీపీ అభ్యర్థులెవరూ సంతృప్తి చెందలేదట. ఎందుకైనా మంచిదని ఈ విషయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తెలియజేశారట. వెంటనే సదరు ఎంపీ అభ్యర్థికి పార్టీ హెడ్‌క్వార్టర్స్ నుంచి ముఖ్యనేతలు ఫోన్లు చేశారట. గతంలో తమకు చెవిలో చెప్పిన మాటను కూడా గుర్తుచేశారట. పార్టీ పెద్దలు ఫోన్‌చేస్తే.. అప్పుడు ఆ పెద్దాయన అసలు విషయం చెప్పారట. "నియోజకవర్గంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అందువల్ల డబ్బు ఖర్చుపెట్టినా ఉపయోగం ఉండదు'' అని తాపీగా వివరించారట. దీంతో వైసీపీ హైకమాండ్‌లోని అగ్రనేతలతోపాటు ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు కూడా కంగుతిన్నారట. వెంటనే అప్రమత్తమైన హైకమాండ్ కొంతమేరకు డబ్బులు సర్దుబాటు చేసిందట. అయితే ఆ సొమ్ములు సరిపోలేదని అభ్యర్థులు వాపోయారట.

అసెంబ్లీ బరిలో ఒక్కో నియోజకవర్గానికి కనీసం 10 కోట్ల రూపాయలైనా ఇస్తారని వైసీపీ అభ్యర్థులు భావించారట. కానీ, ఒక కోటి- రెండు కోట్లతోనే పార్టీ పెద్దలు సరిపెట్టారట. దీంతోనే అసలు చిక్కు వచ్చిపడిందన్నది వైసీపీ అభ్యర్థుల రుసరుస. ఈ వ్యవహారమే ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ టిక్కెట్‌ అందుకున్న ఆ పారిశ్రామిక దిగ్గజంపైనే ఇప్పుడు ఆ పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఖర్చు విషయంలో పార్టీ పెద్దలకి చెవిలో చెప్పిన మాటని ఆయన తప్పారన్నది ఒక విమర్శ. దీనికి తోడు అసెంబ్లీ అభ్యర్థులకు ముందుగా ఇచ్చిన హామీని కూడా అమలుచేయకుండా చేతులేత్తేయడం ఏమిటన్నదే మరో సీరియస్‌ ప్రశ్న. ఈ రెండు కారణాల రీత్యా సదరు అభ్యర్థిపై వైసీపీ శ్రేణులు యమ గుస్సాగా ఉన్నాయి. పోలింగ్‌ తర్వాత వైసీపీ హైకమాండ్ కూడా జరిగిన లోపం గురించి సమీక్షించుకుని ఆవేదన చెందుతోంది. చివరి నిముషంలో అసెంబ్లీ అభ్యర్థులకు డబ్బులు సర్దినప్పటికీ, అవి ఓటర్ల వరకు వెళ్లలేదనే సమాచారం తెలియడంతో ఒకింత ఆందోళన కూడా వారిలో మొదలైంది. అయ్యగారు చేసిన నిర్వాకం వల్ల ఎంత నష్టం జరిగిందన్నది ఫలితాలు వస్తేకాని తెలియదు. ఈ పరిణామాన్ని గమనిస్తున్న వారు "చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే'' అని వ్యాఖ్యానిస్తున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read