వైసీపీలో ఒక్కసారి పరిస్థితులు మారిపోయాయి. వై నాట్ 175 స్లోగన్ ఎదురు తన్నేసింది. కుప్పం కొట్టేస్తున్నామనే ప్రగల్భాలు పులివెందుల చేజారిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డాయి. గెలుపు మాట అటుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని దుస్థితి వైసీపీని వెంటాడుతోంది. ముఖ్యంగా 25 స్థానాల్లో 22 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న వైసీపీకి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడంలేదని ప్రచారం సాగుతోంది.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆర్థిక బలం చూసి అసెంబ్లీకి పంపితే..ఇక్కడ పార్లమెంటు స్థానానికి కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి వైసీపీది. కాకినాడ ఎంపీ వంగా గీత, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా ఎమ్మెల్యే స్థానాల నుంచి బరిలోకి దిగుతామని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. నర్సాపురం ఎంపీగా వైసీపీ నుంచి రెబల్ గా మారిన రఘురామకృష్ణంరాజు స్థానంలో కొత్త అభ్యర్థిని దింపేందుకు కసరత్తు చేస్తున్నారు వైసీపీ వ్యూహకర్తలు.
విజయవాడ పార్లమెంటు నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పివిపి (పొట్లూరి వరప్రసాద్) ఈ సారి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంలేదని, వైసీపీ అధిష్టానం కూడా టిడిపి ఎంపీ కేశినేని నానితో టచ్‌లోకి వెళుతుందని సమాచారం. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలుండి కూడా ఎంపీలుగా ఉండేందుకు వైసీపీలో ఎందుకు అనాసక్తి చూపుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎంపీగా ఎన్నికైనా, పార్టీ అధికారంలో ఉన్నా ఢిల్లీలోనా..తమ నియోజకవర్గంలోనా ఎంపీలని కూరలో కరివేపాకులుగా తీసిపారేస్తుండడంతో చాలా మంది మరోసారి పోటీకి విముఖత చూపుతున్నారు. ఎంపీలు ఢిల్లీలో ఎవరిని కలవాలన్నా..మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి అనుమతి తప్పనిసరి. ఎమ్మెల్యేలు కూడా ఎంపీలకి కనీస గౌరవం ఇవ్వకపోవడంతో తామూ ఎమ్మెల్యే స్థానాలకే పోటీ చేస్తామంటూ అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టే ఎంపీల సంఖ్య పెరిగిపోయింది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ చేతులెత్తేస్తోన్న వైసీపీ ఎంపీలు
Advertisements