వైసీపీ నేత ఇంటి ఆవరణలోని గడ్డివాములో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా పెయింట్స్ బకెట్స్ లో పెట్టి గడ్డివాములో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని వైసీపీ నేత అనంతరెడ్డికి చెందిన నివాసంలోని పెరటిలో వున్న గడ్డివాములో నాలుగు నాటు బాంబులు లభ్యమయ్యాయి. క్లూస్ టీమ్, బాంబ్ స్వ్కాడ్ సహకారంతో పోలీసులు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ బాంబులు నివాసపు ఆవరణలో దాచి పెట్టి వుంచటానికి గల కారణాలేమిటి?
ఫ్యాక్షన్ గొడవలా? లేక రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే బాంబులను దాచి వుంచారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టుగా సీఐ తెలిపారు. పక్కా సమాచారంతో అనంతరెడ్డి పొలాల్లో తనిఖీలు చేపట్టామనీ, ఈ సందర్భంగా ఓ ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నామని సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. గత నాలుగు రోజులుగా అనంతరెడ్డి ఊరిలో లేడనీ, ఆయనపై పాత కేసులు చాలా ఉన్నాయని వెల్లడించారు. ప్రత్యర్థులను హతమార్చడానికే అనంతరెడ్డి ఈ బాంబులను దాచిపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాంబులు బయటపడ్డ నేపథ్యంలో పోలీసులు అనంతరెడ్డి కోసం గాలింపును ముమ్మరం చేశారు.