కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల ప్రలోభాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓటర్లతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు భారీ స్థాయిలో ప్రలోభాలు ఎర వేస్తు న్నారు. విజయవాడకు చెందిన ఓ డివిజన్ స్థాయి నాయకుడికి డివిజన్‌లో మంచి పట్టు ఉండటంతో పాటు సుమారు 2 వేల మంది ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా ఉంది. దీంతో ఆయనపై వైసీపీ నేతల దృష్టి పడింది. తమకు అనుకూలంగా పనిచేస్తే లక్షల విలువైన ఫ్లాటును బహుమతిగా ఇస్తామని ఎర వేశారు. తనకు అలాంటి అవసరం లేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అంతకన్నా ఎక్కువ గౌరవం, పదవులు తనకు దక్కుతాయని సదరు నాయకుడు తేల్చి చెప్పడంతో వారి పాచిక పారలేదు.
ఇక, జిల్లాలో కీలక నియోజకవర్గాలుగా ఉన్న గుడివాడ, మైలవరం, గన్నవరం, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను ప్రలోభాలకు గురి చేసి తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. తమ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని, తమకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తే చాలని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో తమకు అనుకూలంగా పనిచేసే కుల సంఘాల నాయకులకు సుమారు రూ.26 లక్షలు ఖరీదు చేసే ఇన్నోవా వాహనాలను బహుమతిగా ఇచ్చేందుకు వైసీపీ నేతలు ఒప్పందాలు చేసుకున్నారు.
మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ కులాల వారీగా యువజన సంఘాలను ఎంపిక చేసుకుని వారికి హార్నెట్, యూనికాన్, షైన్ వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలను ఇచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం చేయడం.. వైసీపీకి ఓటేసేలా ఓటర్లను ప్రభావితం చేయాలన్నది ఈ యువజన సంఘాలతో వైసీపీ నేతలు చేసుకుంటున్న ఒప్పందం. పోలింగ్ ముగిసిన వెంటనే తమకు పడిన ఓట్ల ఆధారంగా వాహనాలను అందజేస్తామని వైసీపీ నేతలు వారికి హామీ ఇస్తున్నారు. ఇక టీడీపీ గ్రామస్థాయి నాయకులనూ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఓటుకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, దాన్ని ఓటరుకు ఇవ్వాలని, ఎన్ని ఓట్లు తమకు వేయిస్తే అన్ని ఓట్లకూ రూ.5వేలు చొప్పున సదరు టీడీపీ నాయకుడికి ఇస్తా మని వైసీపీ నేతలు ప్రలోభ పెడుతున్నారు.