చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మొరవపల్లెలో పలువురు వైసీపీ నేతలను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నేతల నుంచి ఓటరు లిస్ట్, ఫామ్ 6, 7 పత్రాలను గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, తమ ఓట్లను తొలగించేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు.
మరో పక్క, విశాఖలో వేలాది ఓట్లను తొలగించడానికి కుట్ర జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. జాబితాల నుంచి పేర్లను తొలగించాలంటూ భారీగా దరఖాస్తులు రావటం, దీని వెనుక అక్రమాలున్నట్టు ఆరోపణలు రావటంతో పోలీసులు కూపీ లాగారు. ఒక్కొక్కరు పది నుంచి 85 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారని గుర్తించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించగా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటు తొలగించాలని తాము అసలు దరఖాస్తే చేయలేదంటూ వచ్చిన ఫిర్యాదులను తహసిల్దార్లు పోలీసులకు బదిలీ చేశారు. ఈమేరకు నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 14 పోలీసుస్టేషన్లలో మొత్తం 15 కేసులు నమోదయ్యాయి.
వేలాది ఓట్లను తొలగించడానికి సుమారు 419 మంది దరఖాస్తు చేసినట్టు గుర్తించి, వీరిలో సుమారు 200 మందితో పోలీసులు మాట్లాడారు. తామసలు ఆ దరఖాస్తులే చేయలేదని వారంతా స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. తొలగింపు కోసం దరఖాస్తు చేయడానికి ఓటరు జాబితాల్లోని సమాచారాన్నే అక్రమార్కులు ఉపయోగించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక ప్రాంతంలోని ఓట్లను తొలగించడానికి ఆ ప్రాంతవాసుల ద్వారానే ఫారం-7 నింపి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. కేసులు వాస్తవమని తేలితే దరఖాస్తుదారులకు ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.