కరోనా వైరస్ దేశంలో, రాష్ట్రంలో విజృంభిస్తూ.. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. ప్రజా ప్రతినిధులు మాత్రం రాజకీయానికే ప్రాధాన్యమిస్తున్నారు. పబ్లిసిటీ కోసం విపత్తులో ప్రారంభోత్సవాలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజాప్రతినిధుల పబ్లిసిటీ స్టంట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ భయంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని ఇళ్లల్లో గడుపుతుంటే.. నేతలు మాత్రం తమ పబ్లిసిటీ పిచ్చితో చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉన్నాయి. కరోనా వైరసను ఎదుర్కొనేందుకుఅందరం ఇంట్లో ఉండాలి అంటూ, చేతులు ఎత్తి జగన్ దండం పెట్టి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఇవేవీ తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిదుల తీరుపై జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుంటే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు, సూచనలు చేస్తుంటే.. ప్రజాప్రతినిధులు మాత్రం వీటిని ఆచరించకపోవడం శోచనీయం.

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు పబ్లిసిటీ స్టంట్ల కోసం ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని ఐసోలేషన్ వార్డులకు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో అధికార యంత్రాంగానికి అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలను చేయడం పట్ల ప్రజానీకం మండిపడుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లకు రిబ్బన్లు కట్టి మరీ ప్రారంభించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి. అలాగే పేదలకు ఇచ్చే వెయ్యి రూపాయలు కూడా, జగన్ ఇచ్చాడు, వచ్చే స్థానిక సంస్థల్లో మాకే ఓటు వెయ్యండి అంటూ, కొంత మంది అడుగుతూ ఉన్న వీడియోలో బయటకు వచ్చాయి.

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలే గుంపులు గుంపులుగా చేరి అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ రాష్ట్రంలో కోరలు చాపుతూ రోజురోజుకూ తీవ్రతను చూపుతున్న తరుణంలో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వైకాపా నేతలు పార్టీ గుర్తుతో మాస్కులు తయారు చేసి, వాటిని పంపిణీ చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. పలు చోట్ల వైకాపా రంగులతో ముద్రించిన మాస్కులు కనిపిస్తున్నాయి. ఇలాంటి కనీవినీ ఎరుగని విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రజలను ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని, ముఖ్యమంత్రి చెబుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం అట్టహాసానికి పోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులే ఇష్టానుసారంగా లాక్ డౌన్లో బయట తిరుగుతున్నారని, అలాంటిది ప్రజలకు వారు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read