ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు శాసనసభకు ఎన్నికలు జరగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. తొలి దశలోనే పోలింగ్ జరగడంతో ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటంతో గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని సర్వేలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏపీ ఎన్నికలపై సెంటర్ ఫర్ సెఫాలజీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఓ పార్టీ గెలుస్తుందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రచారంపై స్పందించిన ఆ సంస్థ అధినేత వేణుగోపాల్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సర్వేలు, టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న విషయాలు తమ సంస్థవి కాదని, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ సంస్థ నిర్వహించిన సర్వేలంటూ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని తన స్నేహితులు చెప్పినట్టు ఆయన వివరించారు. ఈ వీడియోల కారణంగా తమ సంస్థ విశ్వసనీయతకు భంగం కలుగుతోందని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులకు విజ్ఙప్తి చేశారు. గత పదిహేనేళ్లుగా తాము ఎన్నికల సమయంలో విశ్లేషణ చేస్తున్నామని, ఇప్పటి వరకు తమ సంస్థపై ఎలాంటి మచ్చలేదని వేణుగోపాల్ రావు అన్నారు. ఎవరో కావాలనే తమ సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు వెల్లడించారు.