ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ విభేదాలు ఈస్థాయిలో బట్టబయలయ్యాయి. ఎంపీ బుట్టా రేణుక, వైసీపీ అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య తగాదాలు రచ్చకెక్కాయి. ఎన్నికల వేళ వైసీపీ ప్రధాన ప్రచారకుల్లో ఒకరిగా జగన్ నియమించిన ఎంపీ బుట్టా రేణుక ను ప్రచారానికి రావద్దని చెన్నకేశవరెడ్డి హుకుం జారీ చేశారు. మూడు రోజుల క్రితం ఎమ్మిగనూరులో ఆమె ప్రచారానికి వస్తే అడ్డుకొని వెనక్కి పంపించేశారు. ఆయన తీరుపై కుర్ణి చేనేతలు భగ్గుమంటున్నారు. ఆదివారం రాత్రి మాచాని సోమప్ప మెమోరియల్ హాలులో చేనేతలు, బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంపీ అభ్యర్థి సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నకేశవరెడ్డి హాజరయ్యారు. చెన్నకేశవరెడ్డి మాట్లాడుతుండగా కుర్ణి చేనేతల్లో బుట్టా అభిమానులు, చేనేత కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. చెన్నకేశవరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
ఎంపీ బుట్టా రేణుక కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు, చేనేతలు ఎక్కువగా ఉండే ఎమ్మిగనూరు పట్టణం ఆడపడుచు, చేనేత పితామహుడు దివంగత మాచాని సోమప్ప కుటుంబంతో ఆమెకు బంధుత్వం ఉంది, అలాంటి వ్యక్తిని ప్రచారానికి రావొద్దంటారా..? అగ్రకుల అహంకారంతోనే చేనేతలను అవమానిస్తున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అదే స్థాయిలో కేశవరెడ్డి కూడా ఎదురుదాడికి దిగారు. కేశవరెడ్డి మాట్లాడుతూ బుట్టా రేణుక నాగులదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కానీ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. సరికదా గ్రామానికి వెళ్లినప్పుడు కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి శిష్యులను గర్రన కూర్చొబెట్టుకొని మాట్లాడి వచ్చేవారు అని ఆరోపించారు. దీంతో ఆందోళనకు దిగిన చేనేత కార్మికులు జయనాగేశ్వరరెడ్డి ఎన్నో సార్లు అడ్డుకున్నారని అన్నారు.
దానికి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ జయనాగేశ్వరెడ్డితో ఏం సంబంధం ఉంది? ఎంపీగా ఆమె చేతిలో రూ.5 కోట్లు ఉంటాయి. ఆ ఊళ్లో జానెడు రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు. గత నాలుగేళ్లలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎంపీగా ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఆమెన మనమెందుకు పిలిపించాలి? అన్నారు. దీంతో కుర్ని చేనేతలు మరింత ఆగ్రహించి 70 ఏళ్లలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో.. ఐదేళ్లలో ఎంపీ బుట్టా రేణుక ఎంత అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. తమ సామాజిక వర్గానికి చెందిన 90 వేల ఓటర్లు మీకు అక్కర్లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేశవరెడ్డి వర్గీయులు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి వెళ్లిరాలేదా అంటూ ఎదురుదాడికి దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, కొద్దిపాటి తోపులాట చోటుచేసుకుంది. కుర్ణి కులస్థులు బుట్టా రేణుకకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్‌కుమార్ మైక్ తీసుకొని సమస్యను చర్చించుకొని పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేసినా కార్మికులు పట్టించుకోకుండా నిరసనకు దిగారు. ఈ వ్యవహారం వీడియో అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మిగనూరులో వైసీపీ ఆత్మీయ సమావేశంలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం, నియోజకవర్గంలో కీలకమైన చేనేతలు ఆగ్రహంతో ఆందోళన చేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.