మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె, ఈ రోజు ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో, ప్రెస్ నిర్వహించారు. విచారణ ఆలస్యం పై అసంతృప్తి వ్యక్తం చేసారు... వైఎస్ సునీత మాటల్లో, "వివేక గారు చనిపోయి రెండేళ్ళు అయ్యింది. ఇంకా ఎంత కాలం, నేను న్యాయం కోసం నిరీక్షించాలి ? ఇప్పటి వరకు ఎవరినీ పట్టుకోలేదు. పులివెందులలో, వైఎస్ ఫ్యామిలీ లాంటి పెద్ద ఫ్యామిలీ ఉండగా, మా ఇంట్లోనే, ఇలా ఎలా జరిగిందో అర్ధం కావటం లేదు. దర్యాప్తు జరుగుతుంది కానీ, రెండేళ్ళు అయినా ఇంకా కొలిక్కి రాకపోవటంతో, మాకు భయం పట్టుకుంది. ఇలా సాగుతూ పొతే, ఇంకా ఎంత మంది ఈ కేసుకు సంబంధించిన వారు చనిపొతారో అని భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వివేక అంటే తెలియని వారు లేరు. ఆయన ఎంతో మందికి సహాయం చేసారు. ఇక్కడ మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో, సాక్ష్యం చెప్పటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన విచారణలో కానీ, ఇప్పుడు సిబిఐ విచారణ కానీ, రెండేళ్ళు అయినా ఎందుకు లేట్ అవుతుందో అర్ధం కావటం లేదు. వివేక గారి కేసులో, సాక్ష్యాలు రకరకాల కారణాలతో చనిపోతున్నారు. ఇంకా ఎంత మంది చనిపోతారో అని భయం వేస్తుంది. ఈ కల్చర్ ఇలాగే కొనసాగితే, సమాజానికి మంచిది కాదు. నేను ఒక సీనియర్ అధికార్ని కలిస్తే, కడపలో ఇలాంటి ఘటనలు సహజం, అయ్యింది ఏదో అయిపొయింది, పిల్లలు ఉన్నారు, వారిని హాయిగా పెంచుకోండి, ఇది వారి పై ప్రభావం చూపిస్తుందని అన్నారు. "
"ఈ రెండేళ్ళలో, ఒక్కటంటే ఒక్క అరెస్ట్ కూడా, ఈ కేసు విషయంలో జరగలేదు. ప్రభుత్వ పెద్దలే దీనికి సమాధానం చెప్పాలి. మా నాన్నకు ఎవరితో గొడవలు లేవు, ఆర్ధిక లావాదేవీలు లేవు, ఇది కేవలం రాజకీయంగా జరిగిన ఘటనగానే మేము భావిస్తున్నాం. వివేక అనే ఆయన, ఇప్పుడున్న సియంకు చిన్నాన్న, మాజీ సియం సొంత సోదరుడు. ఆయనకే ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ? రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలలు విచారణ చేసి, ఏమి చేసింది ? ఆ రాష్ట్ర ప్రజలకు భాదత్ర ఉంటుందా ? నేను ఢిల్లీకి అనేక సార్లు వచ్చి, సిబిఐ అధికారులని కలుస్తూనే ఉన్నాయి. అయితే ఈ సారి కలుద్దాం అనుకున్నా, ఎవరూ అందుబాటులోకి రాలేదు. సిబిఐకి కేసు వెళ్ళినా, ఏమి జరగటం లేదు కాబట్టి, నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఈ ఒత్తిడితో అయినా, వారు వేగంగా ముందుకు వెళ్తారేమో అని ఆశిస్తున్నా. ఈ పోరాటంలో నాకు, అందరి సహకారం కావాలి. నాకు న్యాయం జరగాలి. మా నాన్నకు న్యాయం జరగాలి" అని సునీత అన్నారు.