మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి.. సీబీఐ మాజీ జేడీ, ప్రస్తుత జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఆసక్తికర విషయాలు బయపెట్టారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వివేకా వ్యక్తత్వాన్ని ప్రశంసించారు. లక్ష్మీనారాయణకు, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు బంధుత్వాన్ని అంటగడుతూ.. అప్పట్లో వివేకానంద రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేకా తనకు ఫోన్ చేసి... ‘‘బాబూ తప్పైంది.. వేరే వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు అలా మాట్లాడాను. ఆఫీసుకు వచ్చి క్షమాపణలు చెబుతాను’’ అన్నారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎవరో చెప్పినది విని అలా రియాక్ట్ అయ్యుంటారని.. కాబట్టి దీన్ని అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదని తాను వివేకాతో చెప్పానన్నారు. ఆయన ఆలోచన తీరు అలా ఉంటుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా తనకు ఎలాంటి సబంధం లేదని తెలిపారు. తిత్లీ తుఫాను సమయంలోనే చంద్రబాబును తొలిసారి కలుసుకున్నా అన్నారు.
ఇక విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి, వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీనారాయణ.. విశాఖవాసుల మనసు గెలచుకునేందుకు కొత్త పంధాను ఎంచుకున్నారు. విశాఖకు స్పెషల్ మేనిఫెస్టో అంటూ సంచలన ప్రకటన చేశారు. విశాఖకు మేనిఫెస్టోను బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నానని.. వాటిని చేయకుంటే తనను కోర్టుకు లాగొచ్చని.. ఆ దమ్ము తమ పార్టీకి ఉందని వ్యాఖ్యానించారు. జేడీ ప్రకటనను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ‘విశాఖపట్నానికి మేనిఫెస్టో నేను బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నాను. రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు మీరు చెయ్యలేదు అని. ఆ దమ్ము ఉంది మాకు’అన్నారు.
నామినేషన్ వేసిన రోజే 24 గంటలు విశాఖవాసులకు అందుబాటులో ఉంటానని చెప్పిన లక్ష్మీనారాయణ.. అవసరమైతే బాండ్ పేపర్ కూడా రాసిస్తానన్నారు. తాను రాజకీయాలపైనే దృష్టి పెట్టానని.. మాఫియాలు సపోర్ట్ చేసే నాయకులు కావాలా.. సమర్థవంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. మిగతా పార్టీలు డబ్బులు ఇచ్చి ముందుకు వస్తే.. జనసేన మాత్రం ఆ గబ్బును వదిలించడానికి ముందుకు వచ్చిందన్నారు. కలాం స్ఫూర్తితో, యువతను ఓ మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఆలోచనతోనే జనసేనలో చేరానన్నారు. తనను అన్ని పార్టీలు ఆహ్వానించాయని, అయితే జీరో బడ్జెట్ రాజకీయాలు చేసేవారితో కలవాలని పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపానన్నారు.