వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బాత్రూంలో హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండు పొడిగిస్తూ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ల రిమాండు గడువు ముగియడంతో పోలీసులు వారిని కడప కేంద్రకారాగారం నుంచి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తమను కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందుల సబ్ జైలుకు మార్చాలని కోరుతూ ముగ్గురు నిందితులు పులివెందుల కోర్టులో ఇవాళ పిటిషన్ వేశారు.
అనారోగ్య కారణాలతో పాటు తమ తల్లిదండ్రులు, బంధువులను కలుసుకునేందుకు కడపలో ఇబ్బందిగా ఉందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న పులివెందుల కోర్టు.. ఆ ముగ్గురినీ పులివెందుల సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఆ ముగ్గురినీ పోలీసులు పులివెందుల సబ్ జైలుకు తరలించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే కారణంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది.