అధినాయకత్వం ఆశీస్సుల కోసం ఓ నియోజకవర్గ కన్వీనర్ ప్రయత్నించారు. అందరికీ సన్నిహితంగా మెలిగారు, చివరకు పెద్ద నాయకుడిని కలుసుకున్నారు. మీ వద్ద పార్టీ బాగానే ఉంది. మీరు కాస్త డబ్బులు రెడీ చేసుకోవాలి. మేము చెప్పిన ఫిగర్ మీ ఆర్థిక స్తోమతకు దగ్గరగా ఉండాలి. ఈ విషయాలన్నీ ఫలానా ఆయనతో మాట్లాడండి' అని చెప్పటంతో, ఆ కన్వీనర్ కాస్త విస్తుపోయినట్టు సమాచారం. ఇది వైసిపి పార్టీ తీరు... వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే, మనకు కూడా కొంత స్తోమత ఉండాలి. అందుకనే మీ అంతట మీరుగా ఇంత భరించాలి. దానికి మీరు సిద్ధమేనా? అంటూ వైసీపీ సీనియర్ నేతల నోట వెలువడుతున్న సవాల్ కు ఆ పార్టీ నేతలు అవాక్కవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారెంటీ అనుకున్న వారికి కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురవుతుండటంతో వారి నోట మాట రావడం లేదు. వచ్చే ఎన్నికలు పార్టీకి ప్రాణం పోసినా ఊపిరి తీసినా మనకు మనం కష్టపడాల్సిందే. నియోజకవర్గంలో పోటీ చేయాలంటే పది కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని భరించడానికి మీరు సిద్ధంగా ఉంటే సరేసరి. లేకుంటే వేరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది' అంటూ పార్టీ వర్గాల నుంచి కన్వీనర్లకు అందుతున్న సంకేతాలతో బెదిరిపోతున్నారు.
వాస్తవానికి ఇప్పటికే ఎన్నికల వేడి ప్రారంభమైంది. తెలుగుదేశంతో డీ కొనేందుకు వైసీపీ దాదాపు సిద్ధమైంది. అభ్యరుల గుణగణాలకంటే వారికి ఉన్న ఆర్ధిక స్తోమత పై గురిపెట్టారు. ఇంతకు ముందు అంతా మేం చూసుకుంటాం. క్షేత్ర స్థాయిలో పార్టీని బలపడేలా చేయండంటూ పదేపదే చెప్పే సీనియర్లు ఈ మధ్యన గళం మార్చారు. పార్టీ దృష్టంతా ఇప్పడు శ్రీమంతులపై పడింది. ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాలంటే ఆర్థికంగా పటిష్టమైన వ్యక్తుల కోసం గాలింపు ప్రారంభమైంది. ఆఖరుకి ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా అంతో ఇంతో చేతి చమురున్న వారికే ప్రాధాన్యత దక్కేలా ఉంది.
ఎంపీ టికెట్లు కోరుకుంటున్న వారిలో ఎవరైనా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్దులకు అంతో ఇంతో ఆర్ధిక బాసట ఇవ్వాలి. ఇది మరో కండీషన్ గా చెబుతున్నారు. ఇప్పడు వైసీపీలో ఇదొక వైరల్గా మారింది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే వారంతా పార్టీ ఆశించినట్టుగా శ్రీమంతులై ఉండాలనే సంకేతం వీరిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో పోటీచేసిన అనేక మంది అప్పుడు చేసిన ఖర్చులు, అప్పలు తీరక దిగాలు పడిన వారు ఉన్నారు. కాని మరోసారి పార్టీ నుంచి టికెట్ ఖాయమని చెప్పకుంటున్నా వీరందరినీ ఆర్థిక బెంగ కుంగతీస్తోంది. అంతో ఇంతో పార్టీ నుంచి సపోరు రాకపోదా ? అని ఇప్పటి వరకు ఆశతో ఉన్న వారందరూ తాజా పరిణామాలపై బిక్క చచ్చిపోయారు.