వైసీపీ వై నాట్ 175 నినాదం ఏమో కానీ, పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉన్న 22 మంది ఎంపీలలో రఘురామకృష్ణంరాజు కొరకరాని కొయ్యగా మారారు. ఇప్పుడు మరో ముగ్గురు ఎంపీలు అరెస్టు కాక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే రెండుసార్లు విచారణకి వెళ్లి వచ్చిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని నేడో రేపో అరెస్టు చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 24వ తేదీన అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలే ఫిక్సయ్యారు. కానీ కాస్తంత ఆలస్యంగా మరింత పకడ్బందీగా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ రెడ్డికి కుడి చేయిలాంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు భయంతో వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుతో వైసీపీ ఉలిక్కి పడింది. సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ వైసీపీలో ఇద్దరి ఎంపీల కుటుంబసభ్యులని ఆల్రెడీ అరెస్టు చేసింది. సిసోడియా అరెస్టు నేపథ్యంలో నెక్ట్స్ సౌత్ గ్రూప్ నే సీబీఐ టార్గెట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని అరెస్టు చేసింది. వీళ్లకి బెయిల్ కూడా రాలేదు. సౌత్ గ్రూప్ పై దృష్టి సారిస్తే విజయసాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలని కూడా అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు అరెస్టు కాక తప్పదని తెలుస్తోంది.
ముగ్గురు వైసీపీ ఎంపీల అరెస్టు తప్పదా? ఆందోళనలో జగన్
Advertisements