ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని కులాల నేతలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసి ఎప్పుడూ లేని విధంగా సామాజిక న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ రెడ్డి ప్రకటించారు. 18 మంది అభ్యర్థులలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందినవారేనని, ఇది చరిత్రలో లేని సామాజిక న్యాయం అంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఏ వర్గాలకైతే న్యాయం చేశామని సీఎం ప్రకటించారో ఆయా వర్గాల నుంచే వైసీపీ తమకు సామాజిక అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇది తూర్పు కాపులను అణగదొక్కే చర్యల్లో భాగంగానే చేశారని తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సర్కారు చేసిన అన్యాయానికి నిరసనగా తూర్పు కాపు ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ ని బరిలొకి దింపుతామని సంఘ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో అగ్నికుల క్షత్రియులకు తీరని ద్రోహం వైసీపీ చేసిందని సంఘ నాయకులు ఆందోళనకి దిగారు. అగ్నికుల క్షత్రియులకు ఒక స్థానంలోనైనా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో అన్యాయం జగిరిందన్న రజక పోరాట సమాఖ్య నిరసన తెలిపింది. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని జగన్ విస్మరించారని , వచ్చే ఎన్నికల్లో తడాఖా చూపుతామని సంఘ నేతలు హెచ్చరించారు. బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన గౌడ సామాజికవర్గం నుంచి ఒక్కరికి అవకాడం ఇవ్వకపోవడం గౌడలను అవమానించడమేనని ఆ సంఘం ఆవేదన వెలిబుచ్చింది. బీసీల్లో అత్యధిక జనాభా ఉన్న గౌడ, తూర్పుకాపులతోపాటు వివిధ బీసీసంఘాలు వైసీపీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
వైసీపీ చేసింది సామాజిక అన్యాయం.. కులసంఘాల ఆగ్రహంతో ఉలిక్కిపడ్డ వైసీపీ..
Advertisements