ఆంధ్రప్రదేశ్ యువతలో ఓటర్లుగా ఉన్న దాదపుగా 90 శాతం మంది జగన్ మోహన్ రెడ్డికే మొన్న ఎన్నికల్లో ఓటు వేసి ఉంటారు. జగన్ అన్న వస్తాడు, మా కష్టాలు తీరుస్తాడు అని ఆశగా ఎదురు చూసిన ఏపి యువతకు ఇప్పటికైతే జగన్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వం, తన మ్యానిఫెస్టో హామీల్లో భాగంగా, 2018 ఆగస్టు నుంచి యువనేస్తం పథకం అమల్లోకి తెచ్చింది. ఈ పధకం కింద, దాదపుగా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇచ్చారు. నెలకు వెయ్య రూపాయలు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఇచ్చింది. తరువాత దాన్ని 2 వేలకు పెంచినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా, పెంచిన నిరుద్యోగ భృతి ఇవ్వటం కుదరలేదు. ఎన్నికల అయిన తరువాత ఇవ్వమన్నా, అప్పటి చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదు.
అయితే మా జగనన్న వస్తాడు, మా జీవితాలు మార్చేస్తాడు, మాకు ఇంకా ఎక్కువ నిరుద్యోగ భృతిని ఇస్తాడు అని ఆశగా చూసిన యువతకు, నిరాశ మిగిలింది. మొదటి నెల ఇవ్వకపోవటంతో, ఇబ్బందులు ఉన్నాయోమో, రెండో నెల నుంచి ఇస్తారు అనుకున్నారు. రెండో నెల కూడా ఇవ్వకపోవటంతో, కొత్త పేరుతో బడ్జెట్ లో పెడతారాని ఏపి యువత ఆశించింది. అయితే, బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించక పోవటంతో, అవాక్కవ్వటం ఏపి యువత పని అయ్యింది. ఎందుకిలా చేస్తున్నారు అని అడిగితె, అది చంద్రబాబు పధకం అని, దానికి మాకు సంబధం లేదని, ఇప్పుడు మేము గ్రామా వాలంటీర్లను నియమిస్తున్నామని వైసిపీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ గ్రామ వాలంటీర్లు అన్నీ వైసిపీ నేతలకే ఇస్తున్న సంగతి తెలిసిందే.
గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద కేవలం వెయ్య రూపాయలే ఇచ్చినా, పెద్దల మీద ఆధారపడకుండా తమ ఖర్చులకు ఉపయోగించుకున్నారు. చదువుకుని, ఉద్యోగాలు లేక, అటు తల్లి దండ్రులను డబ్బులు అడగలేక, ఇబ్బంది పడిన యువతకు అప్పుడు చంద్రబాబు ఇచ్చిన వెయ్య రూపాయలు ఎంతో ఉపయోగ పడ్డాయి. అప్లికేషను కోసం, కోచింగ్ కోసం, పుస్తకాల కోసం, చార్జీల కోసం, ఇలా ఉపయోగించుకున్నారు. అయినా, వీరిలో ఎక్కువ మంది, చంద్రబాబుని కాదని, జగన్ వైపు మొగ్గు చూపారు. నిరుద్యోగ భృతి ఒక్కటే కాదు, దీంతో పాటు ఇస్తున్న స్కిల్ డెవలప్మెంట్ పై కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణ జగన్ ప్రభుత్వం ఇప్పించాలని, లబ్ధిదారులు కోరుతున్నారు.