ఇది నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో ఉన్న ఓ అద్భుత లోకం.... అక్కడ అడుగుపెడితే అదో కొత్త బంగారు లోకం... విజయావాడ అంటే కృష్ణా నది, ప్రకాశం బ్యారేజి, రెండు పార్కులు మాత్రమే తెలిసిన నగరవాసులకి, ఈ ప్రదేశానికి వెళ్తే, ఇన్నేళ్ళు ఇక్కడకు ఎందుకు వెళ్ళ లేదా అనిపిస్తుంది... పచ్చని చెట్ల మొక్కల మధ్య నుంచి సీతాకోకచిలుకలు వచ్చి స్వాగతం పలుకుతాయి... ఒక్కటీ రెండూ కాదండి వేలల్లో.. అడుగులు ముందుకు పడుతుంటే మనతో పాటే కదులుతాయి... మనతో మమేకం అయిపోతాయి, మనల్ని ముద్దాడుతాయి.. మొన్నటి వరకు ఎక్కడెక్కడికో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన విజయవాడ వాసులు ఇప్పుడు ఇటువైపు చూస్తున్నారు. సొంత ప్రాంతంలో సరి కొత్త అనుభూతులను పొందుతున్నారు.
ప్రకృతి కొత్త అందాలతో మురిసిపోతోంది విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్న మూలపాడు. సీతాకోక సంపద కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను కమ్మేసుకుంది. ఒకపక్క సెలయేళ్ల నీటి గలగలలు... అటూ ఇటూ కొండలు... మధ్యలో ప్రకృతి పచ్చని కోక కట్టినటుగా కనిపించే అరణ్యం.. మరో పక్క చల్లని గాలులకు, ఇంద్రధనస్సును తలిపిస్తూ, రంగురంగుల సీతాకోక చిలుకలు నాట్యం... వాః అద్భతం కదూ... కాంక్రీట్ జంగల్ గా మారిన విజయవాడ వాసులకి, ఇక్కడ అందమైన సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు.
మూలపాడు, దొనబండ ప్రాంతాల్లో వేలు, లక్షల సంఖ్యలో రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కలు విప్పతాయి. దాదాపు 30 రకాల సీతాకోకచిలుకలు, జూన్, జూలై, ఆగష్టు నెలల్లో అడవి మొత్తాన్ని ఆక్రమించి కొత్త అందాలు తీసుకొస్తాయి. సీతాకోక చిలుకలను దూరం నుంచి మాత్రమే చూసి ఆనందించాలి. వాటిని పటుకోవడానికి ప్రయత్నించడం, పరుగులు తీసూ వాటి స్వేచ్చకు భంగం కలిగించకూడదని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
అక్కడకు ఎలా వెళ్ళాలి ?
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పై (విజయవాడకు 20 కిలోమీటర్ల దూరం) మూలపాడు గ్రామం ఉంది. ఆక్కడి నుంచి కుడి వైపకు 3 కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ ఆటవీ ప్రాంతం మొదలవుతుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల దూరంలో సమాంతరమైన ఆటవీ ప్రాంతంలో అభయాంజనేయస్వామి ఆలయం, దొంగమర్ల బావి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే రంగు రంగుల సీతాకోకచిలుకలు సందడి చేస్తాయి.
ప్రభుత్వం ఇలాంటి అందమైన పర్యాటక కేంద్రాన్ని మరింతగా ప్రాచుర్యం కలిగించి, మంచి పర్యటక కేంద్రంగా, సీతాకోకచిలుకల మనుగడకు ఇబ్బంది లేకుండా మరింత అభివృద్ధి చెయ్యాలి...