విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా తాయారు అయ్యింది... అమరావతి రాజధానిగా చెయ్యటం, అంతకు ముందు తాత్కాలికంగా ప్రభుత్వం మొత్తం విజయవాడ నుంచే పరిపాలన చెయ్యటం, సిటీ పెరగటం, ఇలా అన్ని సమస్యలతో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువ అయింది.. ఒక పక్క విఐపి మూమెంట్ ఉండటం, మరో పక్క కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండటం, ట్రాఫిక్ నియంత్రించటంతో కూడా, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు.. ఇటు వైపు గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది.. మరో పక్క, గొల్లపూడి నుంచి, భవానీపురం మీదగా సిటీకి వచ్చే ట్రాఫిక్ కూడా అంతే... ఈ ట్రాఫిక్ దెబ్బతో ప్రజలు బయటకు వెళ్ళాలి అంటేనే హడలి పోతున్నారు...
ప్రధానంగా సిటీలోకి భారీ వాహనాలు రావటంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై అనేక ఫిర్యాదులు అందటం, అలాగే 1100 కు ఎక్కువ ఫిర్యాదులు దీని మీద రావటంతో, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్ రంగంలోకి దిగారు. ప్రధానంగా కనకదుర్గ వారధి దగ్గర నుంచి గన్నవరం విమానశ్రయం వరకు, లారీలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి రావడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది అని, ఇదే ప్రధాన కారణం అని గుర్తించారు.
హైదరాబాద్ నుంచి కోల్‌కత్తా, చెన్నై నుంచి కోల్‌కత్తా వెళ్లాలన్నా, రావాలన్నా ఇదే మార్గం గుండా వెళ్లాలి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. విజయవాడ నగరంలోకి అనుమతించకుండా 216వ జాతీయ రాహదారి మీదుగా మళ్లించాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా వద్ద ప్రారంభమయ్యే 216వ నెంబర్ జాతీయ రహదారిని రేపల్లె, పెనుమూడి, పామర్రు, కత్తిపూడి మీదుగా ఐదో నెంబర్ జాతీయ రహదారికి మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే విజయవాడ నగరంలోకి భారీ వాహనాలు, లారీలు రాకుండా 216వ జాతీయ రహదారి మీదుగా మళ్లించనున్నారు. నగరంలోకి లారీలను నిషేధించాలన్న ప్రభుత్వ ఆలోచనతో విజయవాడలో వాహనదారుల కష్టాలు చాలా వరకు తీరినట్లే.