రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్ట్ అప్ యూనిట్లను ప్రోత్సహించటానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజి పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టిపిఐ) విజయవాడలో నిర్మిస్తున్న సైబర్ టవర్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. రూ.40 కోట్ల వ్యయంతో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ జి ప్లస్ 6 టవర్ నిర్మాణం ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం ఫినిపింగ్ పనులు జరుగుతు న్నాయి..
స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే కృషా, గుంటూరు జిల్లా ఔత్సహిక యువతకు ఈ టవర్ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ సైబర్ టవర్ మొత్తం 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ టవర్ గ్రౌండ్ ఫ్లోర్ లో హోస్టింగ్, ఇఎస్పి సేవలు, మొదటి ఫ్లోర్ లో డేటా సెంటర్, రెండవ ఫ్లోర్ లో ఇంక్యుబేషన్ సెంటర్ మూడు, నాలుగు, ఐదు ఫోర్లలో పెద్ద ఐటి కంపెనీలు, ఆరవ ఫ్లోర్ ను ట్రైనింగ్ సెంటర్ గా ఉపయోగిస్తారు.
భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రెండవ టవర్ నిర్మించేందుకూ ఎస్టిపిఐ ప్రణాళికలు వేస్తోంది. త్వరలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సైబర్ టవర్ను ప్రారంభించబోతున్నారు. ఈ టవర్ అందుబాటులోకి వస్తే దాదాపుగా వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా.